Bio Asia 2022: బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అతిపెద్ద సదస్సు బయోఆసియా-19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ గ్లోబల్ సదస్సును ఫిబ్రవరి 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 70కు పైగా దేశాల నుంచి 30వేల మంది లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొననున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి వర్చువల్ విధానంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది 'ఫ్యూచర్ రెడీ' థీమ్‌తో నిర్వహించనున్న సదస్సులో ప్రభుత్వం, ఇండస్ట్రీ, అకాడమీయా నుంచి లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో లైఫ్ సైన్సెస్ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హబ్‌గా ఎదుగుతోన్న హైదరాబాద్ నగర జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు కీలకపాత్ర పోషిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటేందుకు ఇదొక చక్కని వేదిక అని పేర్కొంటూ బయో ఆసియా 2022 సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు మంత్రి స్వాగతం పలికారు.
ఇదీ చూడండి: