పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను కేవలం పదినిమిషాల్లో తస్కరించడం ఆ దొంగ ప్రత్యేకత. ఆరు సంవత్సరాల నుంచి బైక్‌లను దొంగలిస్తున్నా పోలీసులకు పట్టుబడకుండా ఉన్నాడంటే చోరకళలో ఎంత సిద్ధహస్తుడో అర్థం చేసుకోవచ్చు. ఎంత నైపుణ్యం ఉన్నా.. ఎక్కడో ఒకచోట తప్పులు చేయక మానడు..పోలీసులకు చిక్కక మానడు. అటువంటి ఘరానా దొంగనే విశాఖ పోలీసులు అరెస్టు చేసి ఏకంగా 130 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2013 నుంచి పార్క్ చేసి ఉంచిన హీరోహోండా బైక్‌లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేసే వీరయ్య చౌదరి పోలీసులకు పెద్ద సవాల్‌గా నిలిచాడు. ఎట్టకేలకు వీరయ్యను అరెస్టు చేసి 130 హీరోహోండా బైకులను, ద్విచక్ర వాహనాల విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పని చేస్తూ కంప్యూటర్ దొంగతనం చేసి 2005లో అరెస్టై విడుదలైన వీరయ్య.. ద్విచక్ర వాహనాలను దొంగలించడం మెుదలు పెట్టాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. బైక్‌లు పార్కింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి : మత్తు పదార్ధాలతో వచ్చే సమస్యలపై కార్యశాల