కేంద్రప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పార్లమెంట్లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన ఆ మహానీయుడికి భారత రత్న ప్రకటించాలని ఆయన కోరారు.
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకుంటున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా బీసీల సంక్షేమంపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనిమంజరి సాగర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.