హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలో భారీ కటౌట్ బ్యానర్‌ను బేగం బజార్ పోలీసులు రాత్రి తొలగించారు. అయోధ్యలో రామ్ మందిర్‌కు ప్రధాని మోదీ భూమి పూజ సందర్భంగా కృతజ్ఞతలు, సహా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు వెలిశాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీని భాజపా యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, భగత్ సింగ్ యువసేవ అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఏర్పాటు చేశారు.
వ్యక్తి ఫిర్యాదుతో...
ఓ వ్యక్తి ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు బ్యానర్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయంతో తొలగించారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం, భగత్ సింగ్ యువజన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిరసనకారులను ఘటనా స్థలం నుంచి పోలీసులు చెదరగొట్టారు.