రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్.. బలహీన వర్గాలపై అణచివేత చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలున్న ప్రజాప్రతినిధులందరిపై వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు.
ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం భావ్యం కాదన్నారు జాజుల. కేబినెట్ విస్తరణ సమయంలో మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. తెరాస వల్లే నేతల్లో గుర్తింపు వచ్చిందనే భ్రమను వీడి.. ఓట్లతో పదవులు వచ్చాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. జనగామ కలెక్టర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూమి కబ్జా చేశారని తేలినా.. వారిపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
మంత్రులు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా ఆరోపణలపై స్పందించని ప్రభుత్వం.. ఈటలపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే వారందరిపై.. సీబీఐ, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అగ్ర కులాల జోలికి వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులకు యావత్ బీసీ సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆన్ లైన్ స్లాట్ బుకింగులు తగ్గించిన ఆర్టీఏ