ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించటం తెలంగాణ ప్రజల ఆనవాయితి. ఈ నవరాత్రులు తెలంగాణ పల్లె పట్టణాలు.. బంధువుల సందడితో... పిండి వంటల ఘుమ ఘుమలతో... ఆడపడుచుల చిరునవ్వులు...పూల వనాల పలకరింపులతో సందడి చేస్తాయి. కన్నుల పండువగా సాగే ఈ బతుకమ్మ పండుగ చరిత్ర, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం...
చల్లగా బతకనివ్వమ్మా అంటూ కోరుతూ.. ప్రకృతిని పూజించే పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతిలోనే కాదు... ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన సామూహిక ఉత్సవం. తీరొక్క పూలను ఏరి ... దొంతర దొంతరలుగా పేర్చి... పూజించే పండుగే బతుకమ్మ. అంతా కలిసి ఆడుతూ పాడుతూ.. చేసుకునే సంబరమే ఈ ఉత్సవం. ఆనందంతోపాటు ఆరోగ్యం... సమైఖ్య భావం నిండి.... తొమ్మిది రోజులపాటు సాగే పండుగ. అలాంటి ఈ సంబురం వెనుక ఎన్నో కథలు వినిపిస్తుంటాయి..
ప్రజల ఇక్కట్లను తీర్చే అమ్మవారిగా...
బతుకమ్మ కథల్లో ఒకటి... ప్రజల ఇక్కట్లను తీర్చే అమ్మవారి జాతర. పూర్వం తెలంగాణ ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లిపోయింది. పంటలు ఎండిపోయాయి. అంటు వ్యాధులు ప్రబలి ఊళ్లకు ఊళ్లే నాశనమైపోయాయి. పుట్టిన బిడ్డలు పుట్టినట్టే కన్నుమూయసాగారు. ఏం చెయ్యాలో అర్థం కాని ప్రజలు భారాన్నంతా భగవంతునిపై వేసి అమ్మవారిని ఆటపాటలతో ప్రసన్నం చేసుకోవాలని సంకల్పించారు. అలా బతుకమ్మ పండుగ మొదలైందని కొందరు చెబుతారు.
ఒకటి ఆధ్యాత్మికం... మరొకటి మానవ సంబంధం...
మరోరెండు కథలు కూడా వినికిడిలో ఉన్నాయి. అందులో ఒకటి ఆధ్యాత్మికమైతే, మరొకటి మానవ సంబంధాల అపూర్వ కల్పన. చోళరాజు ధర్మాంగతునికి సంతానం కలగలేదు. తన భార్య కడుపు పండాలని, రాజ్యానికి వారసులు కావాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు. ఫలితంగా వందమంది కొడుకులు పుడతారు. కాలం కలిసిరాక అంతా యుద్ధాల్లో మరణిస్తారు. లేకలేక పుట్టిన పిల్లలు ఇలా మరణిస్తున్నారని దుఖించిన ఆ దంపతులు లక్ష్మీదేవిని పూజిస్తారు. తమ కడుపున పుట్టమని వేడుకుంటారు. కరుణించిన లక్ష్మీదేవి వారి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె పుట్టిన రోజు సకల రుషులు వచ్చి.. ఆమెను నిండు నూరేళ్లు... చల్లగా బతుకమ్మా అని దీవిస్తారు. అలా లక్ష్మీదేవే బతుకమ్మగా కొలువైందని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం చక్రాంకుడనే రాజుగా జన్మించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పరియణమాడతాడు. ఆ రోజునుంచి లక్ష్మీదేవిని బతుకమ్మగా భావించి...ఆమెను పూలతో అలంకరించి బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటారని చెబుతారు.
తంగేడుపూల కథ ఇదీ!
ఇక జనసామాన్యంలో ఎక్కువగా ప్రసిద్ధికెక్కిన కథ ప్రకారం.... ఓ రైతుకు ఏడవ సంతానంగా అమ్మాయి పుట్టింది. అంతకు ముందు పుట్టిన ఆడ పిల్లలంతా చనిపోతుంటారు ఆమె ఒక్కతే ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కడే మగసంతానం మాత్రం మిగులుతాడు. ఏడవ సంతానంగా పుట్టిన అమ్మాయిని వారంతా బతికిన అమ్మగా భావిస్తారు. ఊరు ఊరంతా అమెను బతుకమ్మా అని పిలుస్తుంటారు. ఆమె అన్నకు బతుకమ్మ అంటే ప్రాణం. ఆ విషయాన్ని బతుకమ్మ ఒదిన ఓర్వలేకపోతుంది. ఓ రోజు పుట్టింటికి వచ్చిన బతుకమ్మను చంపేస్తుంది. అదేరోజు రాత్రి.. భర్తకు కలలో కనిపించి తనను వదిన చంపిన విషయాన్ని చెబుతుంది బతుకమ్మ... తనను చెరువు కట్టమీద పాతిపెట్టారని, అక్కడ తంగెడు చెట్టుగా కొలువయ్యానని చెబుతుంది. ఉదయాన్నే అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే తంగెడు చెట్టు విరబూసి ఉంటుంది. తనను వేరే పూలతో కలిపి అలంకరించి నీటిలో నిమజ్జనం చేయమని భర్తను కోరుతుంది బతుకమ్మ. అప్పటి నుంచే బతుకమ్మను పూజించటం ప్రారంభమైందని పల్లె ప్రజల విశ్వాసం. అందుకే బతుకమ్మ ఉత్సవాల్లో తంగెడుపూలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంటారు.
ఎంగిలిపూలతో ఆగమనం...
తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో మొదటిరోజును మహాలయ అమావాస్య అంటారు. పెత్రమాస లేక పెద్దల అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజున ఎంగిలి పువ్వు పేరుతో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముందురోజు రాత్రి పూలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచి తెల్లవారు వాటిని బతుకమ్మ పేర్చటంలో వినియోగిస్తారు అందుకే ఇది ఎంగిలి పూల బతుకమ్మ. అలా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు అంతా ఒక్క చోట చేరి ఆనందంగా బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లతో ఆకట్టుకుంటారు. కలిసి కట్టుగా సంబరాలను అంబరాన్నంటేలా చేసుకుంటారు.
ఆరోగ్యం, ఐకమత్యం, భగవతారాదనతో కూడిన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు సాగే పాటకచేరి. అద్భుతమైన సంప్రదాయం. ఈ పండుగలో మహిళలే మహారాణులు. వారిదే హడావిడి అంతా!
- ఇదీ చూడండి : వరుణాగ్రహం... భాగ్యనగరంలో లోతట్టుప్రాంతాలు జలమయం