గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణ సమీకరణకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజులుగా బ్యాంకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రుణంతోనే ఇళ్లను పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన కాగా... ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. గత ప్రభుత్వం 3.13 లక్షల గృహాలను చేపట్టగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 51 వేల ఇళ్లను రద్దు చేసింది. మిగతా 2.62 లక్షల ఇళ్లను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. వీటిని లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అప్పగించేందుకు దాదాపు రూ.13 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. లబ్ధిదారుల తరఫున బ్యాంకుల నుంచి రూ.4 వేల కోట్లు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.6 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించారు. బ్యాంకుల నుంచి టిడ్కోకు అందాల్సిన రూ.4 వేల కోట్లలో ఇప్పటివరకు రూ.17 కోట్లే ఇచ్చాయి.
మార్ట్‌గేజ్ చేయాల్సిందే...
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పు ఇచ్చేందుకు గృహాలను మార్ట్‌గేజ్ చేయాలని కొన్ని బ్యాంకులు షరతులు పెడుతున్నాయి. మరికొన్ని ప్రైవేటు బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేయాలని కోరుతున్నాయి. రుణం ఇచ్చిన నాటి నుంచే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంకు షరతు విధించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకొన్ని చెక్కులు ఇవ్వాలని కోరాయి. తరచూ సంప్రదింపులు జరుపుతూ అధికారులు వీటిని పరిష్కరిస్తున్నారు. మొదటి విడతలో చేపట్టే 85 వేల ఇళ్లలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు మినహా పూర్తయిన 40 వేల గృహాలు(365 చ.అడుగులు, 430 చ.అడుగుల విస్తీర్ణం)కు రుణంలో 75% ఇస్తే మార్ట్‌గేజ్ చేస్తామని అధికారులు బ్యాంకర్లకు తెలిపారు. మిగతా 25% పొజిషన్ చూపించిన తర్వాత ఇవ్వాలని కోరారు. ఆ ప్రకారం 40 వేల గృహాలకు రూ.1,200 కోట్లు రుణంగా బ్యాంకులు ఇవ్వాలి. ఇందులో మార్ట్‌గేజ్ అనంతరం 75% సేకరించగలిగినా రూ.900 కోట్లు వస్తాయి. ఆ మొత్తంతో మౌలిక వసతుల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
హడ్కో నుంచి రుణానికి ప్రయత్నం
మొదట్లో రూ.6 వేల కోట్ల రుణ సమీకరణకు హడ్కో, నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ), ఇతర మరికొన్ని వాణిజ్య బ్యాంకులను అధికారులు సంప్రదించారు. నేరుగా ప్రభుత్వాలకు రుణాలివ్వమని ఎన్‌హెచ్‌బీ స్పష్టం చేసింది. వాణిజ్య బ్యాంకులూ వెనకడుగు వేశాయి. దీంతో హడ్కోనే దిక్కుగా మారింది. తమ ఆర్థికస్థితి బాగోలేదని హడ్కో స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే హడ్కోకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని.. ఈ ఏడాది రూ.2 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ నెలాఖరుకు ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఎన్‌పీఏ కింద రూ.44 కోట్లు చెల్లింపు...
గత ప్రభుత్వ హయాంలో 300 చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గృహాలకు లబ్ధిదారుల పేరు మీద బ్యాంకులు రూ.102 కోట్ల మేర రుణాలు ఇచ్చాయి. ఈ విస్తీర్ణం గల ఇళ్లను వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు కట్టాల్సిన పరిస్థితి. ఇళ్ల నిర్మాణం జాప్యం కావడంతో ఖాతాలు నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)గా మారాయి. రుణం విడుదల చెయ్యాలంటే ఈ మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకులు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వం రూ.44 కోట్ల మేర చెల్లించింది. ఇంకా సుమారు రూ.58 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. దీనికి మరో మూడు నెలల గడువు ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Telangana assembly sessions: నిమజ్జనం తర్వాత... మూడో వారంలో..