DAV School Reopening Today: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల ఘటనలో పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ.. మళ్లీ పాఠశాలను తెరిచేందుకు అనుమతిచ్చింది. మిగిలిన విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యా సంవత్సరం వరకు పాఠశాల తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో నేడు పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు.. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాలను మూసే ఉంచాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ అనుమతితో యాజమాన్యం పాఠశాలలోని అన్ని సమస్యలు సరిచూసుకుని, పిల్లల తల్లిదండ్రలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఉదయం పాఠశాలను తెరిచారు. ఈ విషయాన్ని అందరి విద్యార్ధుల తల్లిదండ్రులకు సందేశాలు పంపారు. అయితే ఉదయం వారి తరపు న్యాయవాది ఉదయ్ తో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్న బాధిత తల్లిదండ్రులు అందోళనకు చేశారు. తమకు చెప్పకుండా, నిందితుడికి శిక్ష పడకుండా, తమ బిడ్డకు న్యాయం జరగకుండా పాఠశాలను ఎలా తిరిగి ప్రారంభిస్తారంటూ ప్రిన్సిపల్‌పై వాగ్వాదానికి దిగారు. వీరితో పాటు కాంగ్రెస్ మహిళా కార్యకర్త కాల్వ సుజాత అక్కడికి చేరుకుని బాధిత తల్లిదండ్రులతో పాటు పాఠశాల ముందు బైఠాయించారు. డబ్బులు తీసుకుని పాఠశాల తిరిగి ప్రారంభించారని కాల్వ సుజాత ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్వకేట్ ఉదయ్, కాంగ్రెస్ కార్యకర్త సుజాతను అరెస్ట్ చేశారు. అనంతరం బాధిత తల్లిదండ్రులను బలవంతంగా అక్కడినుంచి వారి ఇంటికి పోలీసు వాహనంలో తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాఠశాల అనుమతులు రద్దు చేస్తే సుమారు 600లకు పైగా ఉన్న విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని...పిల్లల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే విద్యాశాఖ అనుమతులు ఇచ్చిందని పాఠశాల నూతన ప్రిన్సిపల్ శేషాద్రి నాయుడు తెలిపారు. పాఠశాలలో సీసీ కెమెరాలు, అన్ని మౌలిక వసతులు తనిఖీ చేసి, ఉపాధ్యాయులతో సమావేశమయ్యామని ప్రిన్సిపల్ తెలిపారు. బుధవారం పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలు అన్ని తెలుసుకున్న తర్వాతే నేటి నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతుందని అందరికీ సందేశాలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా డీఏవీ ఘటనపై ఇద్దరి నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించారు. తిరిగి కోర్టులో హాజరు పరిచి చంచల్గూడా జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో బాలికను అతను తాకినట్లు నిందితుడు రజనీ కుమార్ ఒప్పుకున్నాడు. బాలిక అవయవాలు తాకినట్లు వివరించాడు. ప్రిన్సిపాల్ మాధవి మాత్రం గతంలో ఇలాంటి ఘటనలు జరిగిందే లేదని విచారణలో తెలిపారు.
ఇవీ చదవండి: