హైదరాబాద్ లింగోజీగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను భాజపా నేతలు కలవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎందుకు కలవాల్సి వచ్చిందనేది నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ఎస్సీ మోర్ఛా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మల్లారెడ్డిని త్రిసభ్య కమిటీలో నియమించారు.
రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డితో సమావేశమైన త్రిసభ్య కమిటీ... ప్రగతిభవన్‌లో ఏం జరిగింది? అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరాలు సేకరించింది. ప్రగతి భవన్‌కు వెళ్లిన నేతలతో పాటు కార్యకర్తలతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీ వేరువేరుగా సమావేశమైంది.
అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం అన్ని అంశాలను క్రోడీకరించి రేపు బండి సంజయ్‌కి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించనుంది. నివేదిక పరిశీలించిన అనంతరం బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష