Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాజపా ప్రజా సంగ్రామ యాత్రను ఒక అస్త్రంగా మల్చుకుంది. తొలి విడత పాదయాత్రలో భాగంగా తెరాస సర్కార్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఎండగట్టింది. హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి హుస్నాబాద్ వరకు 36 రోజుల పాటు జరిగిన పాదయాత్రలో ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందంటూనే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ద్వారా భాజపా శ్రేణుల్లో ఉత్తేజం తేవడంతో పాటు పార్టీ బలోపేతానికి దోహదం చేసింది. శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ నెల 14 నుంచి చేపట్టబోయే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను మొదటి విడత కంటే మరింత విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
30 నిర్వహణ కమిటీలు.. రెండో విడత ప్రజా సంగ్రామ యత్ర విజయవంతం కోసం 30 నిర్వహణ కమిటీలను రాష్ర్ట నాయకత్వం నియమించింది. 31 రోజుల పాటు జరిగే పాదయాత్ర కోసం 2వందల మంది వాలంటీర్లు పనిచేయనున్నట్లు తెలిపింది. అంబేడ్కర్ జయంతి వేడుకల అనంతరం అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తరువాత సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమంకానుంది. అస్సాం లేదా కర్ణాటక ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒకరు పాదయాత్రను ప్రారంభించేందుకు రానున్నారు. తొలి రోజు నాలుగు కిలో మీటర్ల మేర మాత్రమే పాదయాత్ర సాగనుంది. ప్రతి రోజు 13 కిలోమీటర్లు బండి ప్రజా సంగ్రామ యాత్ర నడవనుంది. నాగరకర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనున్నట్లు యాత్ర నిర్వాహుకులు రూట్ మ్యాప్‌ను ప్రకటించారు.
బహిరంగ సభలకు జాతీయ నేతలు: వేసవి కాలం దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ఉదయం వేళ పాదయాత్ర ముగియగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కుల, చేత వృత్తిదారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ బహిరంగ సభలకు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్నట్లు వెల్లడించారు.
ముగింపు సభకు అమిత్ షా: ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత 31 రోజుల పాటు 387కిలో మీటర్ల మేర సాగనుంది. మే 14న మహేశ్వరంలో పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానుండడంతో భారీగా జనసమీకరణ చేయాలని యోచిస్తోంది.
నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఇదే..
ఈ నెల 15 నుంచి 18 మధ్యాహ్నం వరకు అలంపూర్, 18-21 గద్వాల, 22-26 మక్తల్, 27-29 నారాయణపేట, 30 నుంచి మే 2 మధ్యాహ్నం వరకు దేవరకద్ర, 2-3 మహబూబ్‌నగర్, 4న జడ్చర్ల, 5 నుంచి 8 మధ్యాహ్నం వరకు నాగర్‌కర్నూల్, 8-12 కల్వకుర్తి, 13-14 మహేశ్వరం.
ఇదీ చదవండి: ఈ నెల 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్