Bandi Sanjay on TSPSC Paper Leakage Issue: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనదైన శైలిలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌ను ఉద్దేశిస్తూ ఆరోపణలు గుప్పించారు. ఇది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అంటూ దుయ్యబట్టారు. గ్రూప్ 1 సహా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నీ లీకయ్యాయని ఆరోపించారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను తొలగించాల్సిందే: గ్రూప్ 1 ప్రశ్నాపత్రం కూడా లీకైందన్న బండి సంజయ్.. ఇదిగో సాక్ష్యం అంటూ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్ చేసిన టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా అని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కోసం ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా అంటూ టీఎస్పీఎస్సీని నిలదీశారు.
'ఇది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్. గ్రూప్ 1 సహా టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ లీకయ్యాయి. లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను తొలిగించాల్సిందే. 2 నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కేసీఆర్ టీమ్‌కు లీకయ్యాయి. సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయి. లీకేజీపై న్యాయ విచారణ జరపాల్సిందే.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
నిరుద్యోగులతో ప్రగతిభవన్ ముట్టడిస్తాం : రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీమ్‌కు లీకయ్యాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయన్న ఆయన.. ఈ వ్యవహారంపై తక్షణమే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేక ఇంత దారుణాలకు ఒడిగడతారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపని పక్షంలో నిరుద్యోగులతో ప్రగతిభవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే మరోవైపు పలు విద్యార్థి సంఘాలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కమిషన్ బోర్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాల వరుస ఆందోళనల దృష్ట్యా పోలీసు అదనపు బలగాలను మోహరించారు.
ఇవీ చదవండి: