Bandi Sanjay Comments on CM KCR : కల్వకుంట్ల కుటుంబంపై అనుమానం ఉందన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. నెల రోజులుగా కేసీఆర్(CM KCR) కనిపించడం లేదని ముఖ్యమంత్రిని వెంటనే ప్రజల ముందు హాజరు పర్చాలని కోరారు. రాబోయే ఎన్నికలకు కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా అని.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణానీటి వాటాలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినేట్ సమావేశంలో తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు నిధులను కేటాయించడం లేదని ఉద్దేశపూర్వకంగానే బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోదీ నిజామాబాద్ సభలో కల్వకుంట్ల కుటుంబం అసలు స్వరూపం బయటపడిందని.. బీఆర్‌ఎస్ పార్టీలో చీలికలు ఏర్పడుతున్నాయని ధ్వజమెత్తారు.
"కల్వకుంట్ల కుటుంబంపై నాకు అనుమానం ఉంది. నెల రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి. తెలంగాణలో రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్‌ను ప్రకటించాలి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఉద్దేశపూర్వకంగానే బద్నాం చేస్తోంది. మోదీ నిజామాబాద్ సభ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి". - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
BJP MP Laxman fires on BRS : బీఆర్‌ఎస్ పార్టీ చీటర్స్, రాజకీయ పరాన్న జీవుల పార్టీ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. వైఎస్ హయాంలో కేసీఆర్ దిల్లీ వెళ్లి సీఎం పదవి నుంచి వైఎస్‌ను తొలగించి.. తనను సీఎం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి నిలధీశారు. కేసీఆర్ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టుపెట్టేందుకు సిద్దమయ్యారని విమర్శించారు.
ప్రధానమంత్రి మోదీ వేలకోట్ల అభివృద్ది పనులను ప్రారంభించడానికి వస్తే మంత్రి హరీష్‌రావు వ్యవహారించిన తీరు హేయనీయమన్నారు. బీఆర్‌ఎస్ పతనం ఖాయమని తేలిపోయిందని.. మోదీ సభకు స్వచ్ఛందంగా ప్రజలే రావడం నిదర్శమన్నారు. మోదీ రెండు సభలు ట్రైలర్ మాత్రమేనని అసలు సినీమా ముందుందన్నారు. కరీంనగర్ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగానే తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పబోతున్నారని తెలిపారు.
"బీఆర్‌ఎస్ పార్టీ చీటర్స్, రాజకీయ పరాన్న జీవుల పార్టీగా మారింది. కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం.. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. వైఎస్ హయాంలో దిల్లీకి వెళ్లి.. సీఎం పదని తనకు ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానన్నారు". - లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు