Bandi Sanjay on Vizag Steel Plant Bidding: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ మరోసారి తనదైన శైలిలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా.. కోతల రాయుడు కేసీఆర్ పారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్దరణపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ గుండెలు గుభేల్ అంటున్నాయి: కేసీఆర్ చెప్పేవన్నీ కోతలేనని మరోసారి తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. సీఎం చేష్టలతో తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాటలన్నీ కోతలేనని తేలిపోయిందని బండి విమర్శించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. బీజేపీ పోరాటాలతో బీఆర్ఎస్ గుండెలు గుభేల్ అంటున్నాయన్నారు. ఈ నెల 23న నిర్వహించే చేవెళ్ల బహిరంగ సభను.. విజయవంతం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు. చేవెళ్ల బహిరంగ సభకు 'విజయ సంకల్ప సభ'గా నామకరణం చేశామని బండి సంజయ్ తెలిపారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపోయారు. పోటుగాడిలా వెళ్తానన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు పైసలు లేవనంటున్నారు. కేసీఆర్‌ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోంది. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీలపై మాట తప్పారు. చెప్పింది ఒక్కటీ కేసీఆర్ చేయడు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణను ఇలాంటి మూర్ఖుడి చేతిలో పెట్టి మనం మోసపోతున్నాం.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తొలిగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జారీచేసిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనకు 22 స్వదేశీ కంపెనీలతో పాటు ఏడు విదేశీ కంపెనీలు బిడ్లు వేశాయి. మే మొదటి వారంలో తుది టెండర్ ఖరారయ్యే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో.. 25 లక్షల టన్నుల ద్రవపు ఉక్కును ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నేస్-బీఎఫ్3... 15 నెలలుగా మూతపడింది. అయితే.. బీఎఫ్3ని నడపాలన్న ఆలోచనతో ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణకు... మార్చి 27న ప్రకటన జారీచేసింది. ఎవరైనా ఇనుప ఖనిజం, బొగ్గు లేదా డబ్బు అడ్వాన్సుగా ఇస్తే.. తిరిగి తక్కువ ధరకు స్టీలు ఇస్తామని ప్రతిపాదించింది. దీనిపై తొలిగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. బిడ్‌లో పాల్గొంటామని ప్రకటించింది.
సాధ్యాసాధ్యాలపై సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు.. విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించారు. దీంతో బిడ్‌లో సింగరేణి కాలరీస్ పాల్గొంటుందని కార్మికులు అంచనా వేయగా... మొదటి గడువు అయిన ఏప్రిల్ 15 నాటికి పాల్గొనలేదు. మరికొంత సమయం కావాలని.. సింగరేణి కోరింది. ఐదు రోజులు పొడిగించినప్పటికీ.. తెలంగాణ తరఫున కంపెనీలు కానీ, సింగరేణి కానీ బిడ్ వేయలేదు.
ఇవీ చదవండి: