అమరుల ఆశయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) ధ్వజమెత్తారు. నిజమైన ఉద్యమకారులు తెరాస పార్టీలో లేరని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లు బ్లాక్ మెయిల్ చేసేవాళ్లను కేసీఆర్(CM KCR) కేబినెట్‌లోకి తీసుకున్నారని సంజయ్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌కు భాజపా అంటే భయం, భాజపా కార్యకర్తలంటే భయం అని బండి సంజయ్ విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో తెరాస గడీల పాలనను బద్దలు కొట్టేది భాజపాయేనని స్పష్టం చేశారు. తెరాస పార్టీ అవినీతి, కుటుంబ పాలనను ఎదిరించే పార్టీ భాజపానే అని వెల్లడించారు. అందుకోసమే అనేక మంది ఉద్యమకారులు, పలువురు నేతలు భాజపాలో చేరుతున్నారని బండి సంజయ్(bandi sanjay) తెలిపారు.
ఇటీవల భాజపాలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajender) మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా సంజయ్ మర్యాద పూర్వకంగా శాలువా కప్పి ఆహ్వానించారు. నిజమైన ఉద్యమకారుడు ఈటల అని.. అనేక సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తిగా ఆయనను బండి కొనియాడారు.
సీఎం కేసీఆర్ ఈటలను ఎలా ఇబ్బంది పెట్టారో రాష్ట్రమంతా చూశారని పేర్కొన్నారు. కరోనా కాలంలో ఆరోగ్య మంత్రిగా ఆయన అనేక ఆసుపత్రులు తిరిగారని అన్నారు. అలాంటి వ్యక్తి భాజపాలో చేరడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఆ రోజు భాజపా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని సంజయ్(bandi sanjay) ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్(CM KCR) ఏ కార్యక్రమం చేసినా ఏనుగు రవీందర్‌కు ఫోన్ చేసేవారని.. ఇప్పుడు కేసీఆర్‌కు కుడి, ఎడమ వైపు ఎవరున్నారో ఒకసారి చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: suicide attempt: పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం