హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళి(lal darwaza bonalu) అమ్మవారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay), విజయశాంతి(vijaya shanthi), డీకే అరుణ(dk aruna) తదితర భాజపా నేతలు దర్శించుకున్నారు. అమ్మవారికి విజయశాంతి బోనం సమర్పించారు.
ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు భాజపా(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి అని విజయశాంతి మొక్కుకున్నానని చెప్పిందని అన్నారు. అమ్మవారు చాలా శక్తి వంతమైందని... ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు. అనంతరం అంబర్‌పేట్‌లో మహంకాళిని ఆయన దర్శించుకున్నారు. ఆలయలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సైనికుల కోసం అమ్మవారిని మొక్కుకున్నారు. సనాతన ధర్మం నవాబులది కాదు.. హిందువులది. హిందూ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే బోనాల జాతర. భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. సనాతన ధర్మం కాపాడం కోసం మనమంతా కలిసి పోరాడాలి. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని మొక్కుకున్నాను.
బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
కరోనా నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానని భాజపా నాయకురాలు విజయశాంతి అన్నారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మొక్కుకున్నానని తెలిపారు. భాజపా గెలిస్తే బంగారు బోనం సమర్పిస్తానని కోరుకున్నానని... భాజపాతోనే ప్రజా పాలన సాధ్యమని వివరించారు.
తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని ఏడేళ్ల క్రితం మొక్కుకున్నాను. తెలంగాణ వచ్చింది. బోనం సమర్పించాను. కరోనా తగ్గాలని... అందరిని కాపాడాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను. ప్రజా పాలన భాజపాతోనే సాధ్యమవుతుంది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది బోనం సమర్పించుకున్నాను.
విజయశాంతి, భాజపా నాయకురాలు
హైదరాబాద్ నగరమంతా బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. కరోనా మహమ్మారి నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ కృషి పట్ల అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. నియంత పాలన కింద తెలంగాణ తల్లి నలిగిపోతోంది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన తెలంగాణ రాలేదు. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేయాలని కోరుకుంటున్నాను.
-డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇదీ చదవండి: మత సామరస్యానికి లాల్‌దర్వాజ బోనాలు ప్రతీక: రేవంత్‌రెడ్డి