Balkampet Renuka Ellamma Kalyanotsavam 2023 : ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నిర్వహించే బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. జంటనగరాలతో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించగా, సీఎస్ శాంతి కుమారి తలంబ్రాలు అందించారు. ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. బల్కంపేట రహదారిని పూర్తిగా మూసివేశారు.
రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లను పోలీసులు చేసిన.. ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గంటల కొద్దీ లైన్లను ముందుకు కదలనివ్వకపోవటంతో మహిళలు అసహనానికి గురయ్యారు. దీనితో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటను నియంత్రించకుండా పోలీసులు ఉన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో రద్దీని నియంత్రించాల్సిన పోలీసులే.. ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏడాది మేము వస్తాము. అమ్మవారిని నమ్మినవారందరూ చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో ఉంటారు. ఏర్పాట్లు మాత్రం కొంచెం బాగోలేవు. ఆడవారికి, పురుషులకు వేర్వేరు లైన్లు ఉంటే బాగుంటుంది. వీఐపీ, వీవీఐపీ టిక్కెట్లనే ఎక్కువ ఇచ్చారు. దర్శనం చాలా ఆలస్యంగా సాగుతోంది." - భక్తులు
Balkampet Renuka Ellamma Kalyanam : ఈ తోపులాటలో ఒక భక్తురాలు స్పృహ తప్పి పడిపోవడంతో.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ఆమెను రక్షించారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నామని అయినా దర్శనాలు చాలా ఆలస్యంగా అవుతున్నాయని మండిపడ్డారు. ఆలయ నిర్వాహకులు సైతం సరైన ఏర్పాట్లను చేయకపోవడంతోనే తోపులాట వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. వీఐపీ, వీవీఐపీల పేరుతో అధిక సంఖ్యలో పాస్‌లను అనుమతించారని.. వీటివల్ల సామాన్య భక్తులు అవస్థలు పడ్డారని భక్తులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక నుంచైనా ఆలయ సిబ్బంది సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం ప్రసాదించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
బల్కం రేణుక ఎల్లమ్మ చరిత్ర : 700 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడకముందు పొలాలతో బల్కంపేట గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతూ ఉంటే ఒక వస్తువు రాయిలా అడ్డం వచ్చింది. ఒక్కసారిగా అవాక్కైన రైతు.. ఊరులో వాళ్లను పిలిపించుకొని వచ్చి ఆ బావిలో వెలసింది ఎల్లమ్మ తల్లి అని నమ్మి.. అక్కడే పూజలు చేశారు. ఆ విగ్రహం కింద నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరి తెలియదు.
ఇవీ చదవండి :