Balka Suman Comments on BJP Deeksha: భాజపా నేతలు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే దీక్షలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తెలంగాణలోనే మొదలైనట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారన్న బాల్క సుమన్.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులను సస్పెండ్ చేయలేదా అని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులను దొంగ లెక్కలంటున్న నేతలకు.. అవగాహన లేదని సుమన్ విమర్శించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు
కేసీఆర్పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని... తాము కూడా నరేంద్రమోదీ, అమిత్ షాలపై అసభ్యంగా మాట్లాడగలమని సుమన్ అన్నారు. బుల్ డోజర్ల భాషతో గ్రామాల్లో విధ్వంసం సృష్టించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. స్వల్ప అస్వస్థత కారణంగా సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళితే.. మానవత్వం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ సాగదు
"భాజపా నేతల విధానం విధ్వంసం. మాది వికాసం. అవసరమైతే విభజన హామీలు, రాజ్యాంగ పరిరక్షణ, జాతీయ ప్రాజెక్టు కోసం దిల్లీలో దీక్షలు చేయాలి కానీ హైదరాబాద్లో కాదు. భాజపా కుట్ర పూరిత, ఉత్తర భారత తరహా రాజకీయం తెలంగాణలో సాగదు. రాష్ట్ర భాజపా నాయకులు గుజరాత్ నేతలకు బానిసలయ్యారు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేలయ్యారు. వారిని ఉద్యమ ద్రోహులుగా పేర్కొనడం హాస్యాస్పదం. మిషన్ కాకతీయ చెరువలు, సాగునీటి ప్రాజెక్టులను కూల్చేందుకే బుల్ డోజర్లు తెస్తారా.?" -బాల్క సుమన్, ప్రభుత్వ విప్
గెలుపంటే అలా ఉండాలి
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయనేది ముఖ్యం కాదని.. ఎంత అర్థవంతంగా జరిగాయో చూడాలని బాల్క సుమన్ హితవు పలికారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు ప్రజల కోణంలో ఉంటాయని.. ఎన్నికల కోణంలో కాదని స్పష్టం చేశారు. గెలుపంటే 2018లో తెరాస గెలిచినట్లుగా ఉండాలన్నారు. యూపీలో భాజపాకు సీట్లు తగ్గాయని.. వచ్చే ఎన్నికల్లో కమలం బలమెంతో తేలిపోతుందని పేర్కొన్నారు. భాజపా నేతలు విధానాలపై మాట్లాడకుండా.. పనికి రాని అంశాలను లేవనెత్తి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: KTR on Bandi Sanjay: 'మత పిచ్చి తప్ప.. సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా .?'