హైదరాబాద్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ. 1.25 లక్షలతో కూడిన సంచిని భద్రంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన రామ్‌రాజ్ తివారి అనే పూజారి కుమార్తె వివాహం నిశ్చయం అయింది. దీంతో పెళ్లి పనులకు సంబంధించిన డబ్బు సంచితో పాటు పెళ్లి పత్రికలను తీసుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆలయంలో పూజ చేయించేందుకు... షేక్‌పేట ప్రాంతంలో ఆటో ఎక్కాడు. పూజారి ఆటోలో ఆలయం వద్దకు రాగానే నగదుతో కూడిన సంచిని అందులోనే మరిచిపోయి దిగిపోయాడు.
అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ హుస్సేన్ తన ఆటోలో ఉన్న డబ్బు సంచిని గమనించాడు. వెంటనే రామ్‌రాజ్ తివారి కోసం వెతికినా కనిపించకపోవడంతో నేరుగా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ కన్నెబోయిన ఉదయ్‌కు జరిగిన విషయం చెప్పి... డబ్బును అందజేశాడు. అదే సమయంలో డబ్బును మర్చిపోయిన పూజారి ఠాణాకు రావడంతో డ్రైవర్ హుస్సేన్ చేతుల మీదుగా నగదుగల సంచిని యాజమానికి అప్పగించారు. ఆటో డ్రైవర్ మంచి తనాన్ని అభినందించి బహుమతిని అందజేశారు.
ఇదీ చదవండి: Bandi Sanjay on KCR: 'సీఎం సొంత జిల్లాలోనే ఆత్మహత్యలు.. రైతుల కోసం ఏం చేశారు.?'