రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ప్రగతి భవన్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. భాజపా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా కాలయాపన చేస్తోందని రైతులు ఆరోపించారు. దీనికి నిరసనగా గోడపత్రికలు, ఉరితాళ్లు పట్టుకుని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు యత్నించిన భాజపా నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన ద్వారం వద్ద రైతులు బైఠాయించి కదలబోమంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి గోషామహల్ పీఎస్కు తరలించారు.
రుణ మాఫీ అమలు చేయాలి
2018,19 సంవత్సరాల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఖరీఫ్ పంట కాలాల్లో లక్షా యాభై వేల మందికి పైగా రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద ప్రీమియం చెల్లించారని అన్నదాతలు పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ధనం చెల్లించకపోవడంతో పంట నష్టపరిహారం అందకపోవడం వల్ల రైతన్నలు నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. రైతులు, కేంద్రం తమ వాటా ధనం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మేరకు తక్షణమే రుణ మాఫీ పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కదనరంగాన్ని తలపించిన యుద్ధవిమాన విన్యాసాలు