Assocham millets Conference in Hyderabad: సమాజంలో పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతున్న చిన్నారులు, యువత ఆధునిక ఆహార పోకడల్లో మునిగిపోతున్నారు. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ అంటూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వీకుల ఆహారం గురించి యువతకు తెలియజెప్పి.. ఆహారంలో భాగం చేయడం ద్వారా పోషక విలువలు, శక్తి పెంపొందించి ఆరోగ్య భారతావని నిర్మాణం చేయాలన్న ప్రయత్నాలకు ఇదే సరైన సమయం.
ఇది దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తుల తయారీ వంటి అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని.. తాజాగా హైదరాబాద్‌లో అసోచాం ఆధ్వర్యంలో జరిగిన "చిరు ధాన్యాల సదస్సు" విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు అసోచాం ప్రతినిధులు, చిరుధాన్యాల రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరయ్యారు.
International millets year: ఎనిమిదిన్నరేళ్లుగా చిరుధాన్యాల సాగు సహా అంకుర కేంద్రాల స్థాపనకు ప్రోత్సాహం ఇస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కారద్యర్శి జయేశ్‌రంజన్ అన్నారు. హరిత విప్లవం విజయవంతమైన నేపథ్యంలో చిరుధాన్యాల ప్రాభవం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రధాన ఆహార పంట వరి, గోధుమ పంటల సాగు గణనీయంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అధిక పంట దిగుబడుల కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో అవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
అధిక శాతం ఉత్పత్తి భారత్‌లోనే: ఈ నేపథ్యంలో బహుళ పోషకాలు గల చిరుధాన్యాల సాగు, వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతోపాటు సగటు వినియోగం సైతం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 13.63 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామలు వంటి 9 రకాల చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఏటా 18.52 మిలియన్ టన్నుల దిగుబడులు లభిస్తున్నాయి. సగటు దిగుబడి 1322 కిలోల చొప్పున నమోదవుతోంది. ప్రపంచానికి అవసరమైన అధిక శాతం చిరుధాన్యాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
నిర్లక్ష్యానికి గురవుతోన్న చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగం భారీగా పెంచేందుకు కృషిచేస్తున్నామని నిపుణులు తెలిపారు. ఇవాళ్టి రెండు రోజులపాటు మహబూబ్‌నగర్‌లో భారీ చిరుధాన్యాల మేళా జరగనుంది. చిరుధాన్యాల పంటల సాగు, కొత్త వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆహారోత్పత్తుల తయారీలో భారత్... గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. చిరుధాన్యాల రైతులు, పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులను ఆకర్షించడంతో పాటు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆహారం భాగం చేయాలన్నదే భారత్ లక్ష్యం.
ఇవీ చదవండి:
దేశంలో చిరుధాన్యాల విప్లవంపై దృష్టి సారించిన కేంద్రం
'దేశంలో ఆవిష్కరణలు కొత్తపుంతలు.. ఆ జాబితాలో ఐదో స్థానంలో భారత్'