Asani Effect On Telangana: అసని తుపాన్ ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వెల్లడించింది. నిన్న పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను అసని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు తుపానుగా బలహీనపడి మచిలీపట్టణానికి ఆగ్నేయ దిశగా 40కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఈ తుపాను సుమారుగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించి నరసాపురం, యానాం, కాకినాడ, విశాఖపట్నం తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఈరోజు సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉందని.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి రేపు ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తుపాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతుందని వెల్లడించింది.
ఇంటర్ పరీక్ష వాయిదా: అసని తుపాను ప్రభావం ఏపీ ఇంటర్ పరీక్షలపై పడింది. ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. తుపాను వల్ల ఇంటర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈరోజు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈనెల 25న నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఇవీ చూడండి: