Delhi CM Arvind Kejriwal Meet CM KCR : హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్ కలిశారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. అంతకుముందు బేగంపేట విమానశ్రయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్లకు.. మంత్రి పువ్వాడ అజయ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న వారికి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా : దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌ల విషయమై.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కలిసి రావాలని అరవింద్ కేజ్రీవాల్.. కేసీఆర్‌ను కోరారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు
Delhi vs Centre Ordinance : ఇటీవలే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మద్దతు కోరారు. దిల్లీలోని అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈక్రమంలోనే దీనిపై పార్లమెంట్లో వ్యతిరేక గళం వినిపించాలని.. కేజ్రీవాల్ విపక్ష నేతల మద్దతును కూడగడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేంద్రం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. అందుకే ఇలాంటి ఆర్డినెన్స్‌లు తీసుకువస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
ఎన్నికైన ప్రభుత్వానికే : ఇటీవలే దేశ రాజధాని దిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ అధికారం కేవలం.. ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్కార్కే అసలైన అధికారాలు ఉండాలని వివరించింది. దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పును న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
మరోవైపు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. దిల్లీలోని గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు.. క్రమశిక్షణ చర్యలకు గాను.. మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులపై నిర్ణయాలు తీసుకునేందుకు.. జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ సీఎం ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి : దిల్లీ అధికారాలు ప్రభుత్వానికే తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ కోర్టు ధిక్కారమేనన్న కేజ్రీవాల్
కూటమి కోసం నీతీశ్ రాయబారం.. కేజ్రీవాల్ నోట 'ఉమ్మడి పోరు' మాట!