ఓసీలు, బీసీల మద్దతుతో తెలంగాణలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న భాజపా.. జాతీయ కార్యవర్గ కూర్పులోనూ ఆ క్రమంలోనే ముందుకెళ్లినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఓసీల నుంచి కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించగా బీసీ అయిన బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌కు గవర్నర్‌గా పంపింది. మరో బీసీ నేత బండి సంజయ్‌కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం కోసం దాదాపు డజను మందికిపైగా నేతల పేర్లను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి పంపింది.
లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణలతో పాటు జితేందర్‌రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరుల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. లక్ష్మణ్ స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి అరుణ పేరు ప్రచారంలోకి వచ్చినా అప్పట్లో ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఓసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం ద్వారా ప్రాధాన్యం కల్పించినట్లయ్యింది.
గతంలో బండారు దత్తాత్రేయ, వి.రామారావు, బంగారు లక్ష్మణ్ వంటి నేతలు ఆ పదవిని నిర్వహించారు. తెలంగాణలో బీసీలు అధికం కాగా అందులో ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలను పార్టీ అప్పగించింది. గతంలో ఓసారి ఆయన జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణకు చెందిన మురళీధర్‌రావు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు పనిచేశారు. నడ్డా బృందంలో తాజాగా 9 మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా.. మురళీధర్‌రావుకు గానీ, తెలంగాణ నుంచి మరెవరికి గానీ అవకాశం లభించలేదు. ఆయనను ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని భాజపా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణకు సముచిత ప్రాధాన్యం: బండి సంజయ్
పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు సముచిత ప్రాధాన్యం దక్కిందని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష్మణ్, డీకే అరుణలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ కమిటీలో తెలంగాణ, ఏపీల నేతలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా రెండు రాష్ట్రాలపై భాజపా నాయకత్వం దృష్టి సారించిందన్న విషయం స్పష్టమైందన్నారు.
ఇదీ చదవండి: దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభం...