Rahul Gandhi Telangana Tour: రాష్ట్రంలో అధికారం హస్తగతమే లక్ష్యంగా ఓరుగల్లు వేదికనుంచే సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. హనుమకొండలో ఈ నెల 6న రాహుల్ గాంధీ... రైతు సంఘర్షణ సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులను ఈ సభకు తరలించేందుకు... ఇప్పటికే పీసీసీ సన్నాహక సమావేశాలను నిర్వహించింది. పర్యటనను సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర పీసీసీ పలు కమిటీలు నియమించింది. రిసెప్షన్, కోఆర్డినేషన్, ప్రచారం, జనసమీకరణతో ఉస్మానియా యూనివర్శిటీ ఏర్పాట్లు తదితరాలకు కమిటీలు నియమించారు.
సభలో నేతల కోసం ఒకటి, రైతు కుటుంబాల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, పరిహారం పొందని రైతులతో పాటు నష్టపోయిన రైతులను తీసుకురానున్నారు. ఇప్పటికే సభావేదికను పరిశీలిస్తున్న సీనియర్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... రైతులకు చేస్తున్న మోసాలపై పోరుబాటను సభలో ప్రకటిస్తామని చెబుతున్నారు.
ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతించకపోవడంపైనా రాష్ట్ర కాంగ్రెస్ పోరాడుతోంది. రాహుల్ ముఖాముఖికి అనుమతి ఇప్పించాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించగా... అభ్యంతరాలు ఉంటే మళ్లీ రావాలని కోర్టు సూచించింది. వర్సిటీలోనూ ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళనలు చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయడంపై మహిళా కాంగ్రెస్ నేతలతో సహా రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అరైస్టై చంచల్‌గూడ జైలులో ఉన్నవారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత రీతిలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వంపై విద్యార్థి లోకం ఐక్యమై పోరాడాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఇవీ చదవండి: