ఆంధ్రప్రదేశ్‌లో దసరా శరన్నవరాత్రులకు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం పెట్టింది పేరు. ఏటా అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కరోనా దృష్ట్యా ఈసారి కేవలం రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. నిర్వహణ ఖర్చును సైతం ఈ ఏడాది సగానికి తగ్గించారు.
ఈనెల 21న మూలా నక్షత్రం కావడంతో... ఆ రోజు మాత్రం 20 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపిన అధికారులు.. మూలా నక్షత్రం రోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేవీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కల్పించారు. మిగిలిన రోజులు ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభంకానున్నాయి.
నవరాత్రి ఉత్సవాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వినాయక ఆలయం నుంచి కొండపైకి 2 కిలోమీటర్ల మేర క్యూలైన్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజు ధరించాలని సూచించారు. ఇప్పటివరకు భక్తులు 74 వేల టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా భక్తులకు మంచినీటి సౌకర్యానికి పరిమిత ఏర్పాట్లే చేశారు. భక్తులే తాగునీరు తెచ్చుకోవాలన్నారు. ఈసారి కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉండనుంది.
కృష్ణానదిలోని స్నానాలు చేసేందుకు భక్తులను అనుమతించడం లేదు. అందుకే ఘాట్లలో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అధికారులు తెలిపారు. తలనీలాలు సమర్పించడం, కృష్ణా నదిలో స్నానాలు చేయడం ఉండదని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఆలయ ఈవో సురేశ్‌బాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... అలుపెరుగని అమరావతి ఉద్యమానికి 300 రోజులు