పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతులు, బాలికల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వివాహాలు చేసుకుని అనంతరం వదిలేసి వెళ్లిపోతున్న అరబ్‌షేక్‌లు కొద్దినెలలు విరామమిచ్చి తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతబస్తీలో రెండేళ్ల క్రితం షేక్‌ల అక్రమ నిఖాల బాగోతం తెరపడిందన్న భావనతో పోలీసులు వీటిపై దృష్టి సారించడం లేదు. తాజాగా మూడు రోజుల క్రితం బహ్రెయిన్ దేశస్థుడు ఎబ్రాహిం షుక్రల్లా మొహమ్మద్ బైరమిపై పాతబస్తీకి చెందిన యువతి తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేయడం.. చాంద్రాయణగుట్ట పోలీసులు విచారణ చేపట్టడం వల్ల నిఖా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సాబేర్ దంపతులే కీలక పాత్రధారులు
ఎబ్రాహిం నుంచి డబ్బులు తీసుకున్న దళారీ మహ్మద్ సాబేర్, అతడి భార్య సమీనా కీలక పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరూ కొన్ని నెలల నుంచి అరబ్ షేక్‌లతో మాట్లాడుతూ వారికి నగరంలోని యువతులతో పెళ్లిళ్లు చేయిస్తున్నారని పోలీసులకు ఆధారాలు లభించగా.. ప్రత్యేక విభాగం అధికారులు, పోలీసులు దొంగ వివాహాలపై దృష్టి సారించారు.
డబ్బులొస్తాయంటూ బలవంతం..
అరవై ఏళ్ల ఎబ్రాహిం.. ఆరు నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకుంటానని, పాతికేళ్లలోపు యువతితో నిఖా చేయించాలని నబీల్ కాలనీలో ఉంటున్న మహ్మద్ సాబేర్‌కు ఫోన్ చేశాడు. అమ్మాయి తయారుగా ఉందని చెప్పగా 2019 అక్టోబరులో నగరానికి వచ్చాడు. అదేరోజు అంబర్‌పేటకు చెందిన ఓ యువతితో సాబేర్ నిఖా చేయించాడు. నాలుగైదు రోజులున్న తర్వాత ఎబ్రాహిం బహ్రెయిన్‌కు వెళ్లిపోయాడు. షేక్‌ను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే నగదు ఇస్తానంటూ అంబర్‌పేట యువతిని సాబేర్ బలవంతం చేయగా ఆమె ఆ వివాహానికి ఒప్పుకొంది. అతను బహ్రెయిన్‌కు వెళ్లగానే ఆమె ఇంటికి వెళ్లిపోయింది.
తన రెండో భార్యను తీసుకెళ్తానంటూ గత నెల 25న ఎబ్రాహిం తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. సాబేర్ సలహాతో బార్కస్ సలాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సాబేర్ అదేరోజు అరబ్‌షేక్‌తో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె సోదరిని ఎబ్రాహిం నివాసానికి తీసుకువచ్చాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా.. ఆ యువతి తిరస్కరించింది. దీంతో సాబేర్ భార్య ఫాతిమా రంగప్రవేశం చేసి యువతిని మళ్లీ తీసుకొచ్చి అరబ్‌షేక్ ఇంట్లో వదిలేసింది. అప్పటి నుంచి మూడు రోజుల పాటు ఎబ్రాహిం ఆమెపై లైంగికదాడి కొనసాగించాడు. బాధితురాలి సోదరికి విషయం తెలిసి సాబేర్‌ను నిలదీయడం.. వారు బాధితురాలి ఆచూకీ తెలపగా మూడు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గుట్టుచప్పుడు కాకుండా నిఖాలు
పోలీసుల దృష్టికి రాకుండా కొందరు దళారులు గుట్టుచప్పుడు కాకుండా కొద్దినెలల నుంచి నిఖాలు చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, శాలిబండ, మొగల్పురా, సంతోష్‌నగర్ ఠాణాల పరిధుల్లోని కొన్ని ప్రాంతాల్లో దళారులు దుబాయ్, మస్కట్, బహ్రెయిన్లలో నివాసముంటున్న ముసలి షేక్‌లతో ఇప్పటికీ మంతనాలు కొనసాగిస్తున్నారని సమాచారం.
పేద కుటుంబాలే లక్ష్యం..
రూ.15లక్షల నుంచి రూ.20లక్షలు ఇస్తే చాలు.. అందమైన యువతితో నిఖా జరిపిస్తామంటూ చెబుతున్నారు. వారు అంగీకారం తెలిపిన వెంటనే తమ పరిచయస్తులు, స్నేహితులకు వివరాలు చెబుతున్నారు. కొద్దిరోజులు భార్యగా నటిస్తే రూ.లక్షలు వస్తాయంటూ నమ్మిస్తున్నారు. యువతులు, బాలికల తల్లిదండ్రులు అంగీకరించగానే.. విషయాన్ని షేక్‌లకు వివరిస్తున్నారు.
మొదట నటన.. తర్వాత కమిషన్ల సర్దుబాటు
హైదరాబాద్‌కు వారు రాగానే అప్పటికే కిరాయికి తీసుకున్న ఇంట్లో వారిని ఉంచుతున్నారు. ఓ గదిలో నిఖా జరిపిస్తున్నారు. నాలుగైదు రోజుల తర్వాత ముసలి షేక్‌లను వారి సొంత దేశాలకు పంపుతున్నారు. అనంతరం కమిషన్లు పంచుకుంటున్నారు. ఎబ్రాహింకు నిఖా జరిపించిన దళారి సాబేర్‌ను పట్టుకుంటే మరిన్ని అక్రమ నిఖాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'