శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీ (Mlc)ల పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌తో పాటు చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ ఇందులో ఉన్నారు. సాధారణంగా పదవీకాలం పూర్తయ్యేలోపు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇప్పట్లో నిర్వహించం...
కానీ కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీంతో జూన్‌లో ఆ స్థానాలు ఇప్పట్లో భర్తయ్యేలా లేవు. ఆరు స్థానాలు కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉండనున్నాయి. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సభ్యత్వాలు కూడా పూర్తై రెండు పదవులు ఖాళీ అవుతాయి. రాజ్యాంగంలోని 184వ అధికరణ ప్రకారం శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ అయితే ప్రొటెం ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంటుంది.
2011 తరహా సందర్భం...
2011లో ఇదే తరహా సందర్భం వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ జానీ పదవీకాలం పూర్తి కావడంతో రెండు పదవులూ ఖాళీ అయ్యాయి. దీంతో అప్పట్లో సీనియర్ ఎమ్మెల్సీ (Mlc) అయిన సింగం బసవపున్నయ్యను ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా శాసనమండలికి ప్రొటెం ఛైర్మన్‌ను నియామకం అనివార్యమైంది. నియామకం అనంతరం ప్రొటెం ఛైర్మన్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రొటెం ఛైర్మన్ హోదాలో మండలి ఛైర్మన్ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు.
అన్ని అధికారాలు...
సభాకార్యకలాపాల నిర్వహణ సహా ఛైర్మన్‌కు ఉండే అన్ని అధికారాలు, హోదా ప్రొటెం ఛైర్మన్ (Protem chairman)కు వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తే మండలి సమావేశాల నిర్వహణతో పాటు ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టవచ్చు. కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తై బాధ్యతలు స్వీకరించే వరకు ప్రొటెం ఛైర్మన్ పదవిలో ఉంటారు. ఇవాళ సాయంత్రంతో పదవీకాలం పూర్తవుతున్నందన ఇవాళో, రేపో ప్రొటెం ఛైర్మన్‌ను నియమించనున్నారు. సాధారణంగా ఉన్న వారిలో సీనియర్ సభ్యునిగా ఉన్నవారిని ప్రొటెంగా నియమించడం సంప్రదాయం.
వారికేనా...
ప్రస్తుతం ఎమ్మెల్సీ (Mlc)లుగా ఉన్న వారిలో డి. రాజేశ్వర్ రావు, వి. భూపాల్ రెడ్డి 2007లో మండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో వారిలో ఒకరిని ప్రొటెంగా నియమించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా ప్రభుత్వ నిర్ణయం మేరకు వేరే ఎవరికైనా ఈ అవకాశం దక్కవచ్చు.
ఇదీ చదవండి: Hero Nikhil: హీరో నిఖిల్ కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు