ఒకసారి భూములు అమ్మిన తర్వాత ఆ భూములకు విలువ పెరిగితే.. భూములు కొన్నవారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తే... చాలా ప్రమాదకర ధోరణికి తావిచ్చినట్లు అవుతుంది. విక్రయదారులంతా తాము అమ్మిన భూములకు విలువ పెరిగాక కొన్నవారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉంది. అలాంటి కేసులు వరదలా వెల్లువెత్తుతాయి. చట్టం దానికి అనుమతించదు.
ఈ కేసులో వాస్తవాల్ని బట్టి చూస్తుంటే.. ప్రాసిక్యూషన్ కొన్ని చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి, ఊహాజనితమైన కుట్ర కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని, కథ అల్లాలని చూస్తోందని అర్థమవుతోంది. ఈ కేసును ఏదోలా ఐపీసీ సెక్షన్-120బి పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ 120-బి సెక్షన్ వర్తించే నేరం ఏదీ జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది. - హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం ఎక్కడ జరగనుందన్న సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి ముందే... ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దల నుంచి, అధికారుల నుంచి కొందరు వ్యక్తులు తెలుసుకుని మోసపూరితంగా భూములు కొన్నారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సీఐడీ నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ అన్నది స్టాక్ మార్కెట్‌లో సెక్యూరిటీలు, బాండ్ల క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారమని తెలిపింది. భూముల వంటి స్థిరాస్తుల క్రయ విక్రయాలకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్న భావన, దానికి సంబంధించిన చట్టాలు వర్తించవని స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో, దానికి చుట్టుపక్కల జరిగిన భూముల క్రయ విక్రయాలను ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడానికి గానీ, అక్కడ భూములు కొన్నవారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న పేరుతో ప్రాసిక్యూట్ చేయడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణానదికి పక్కన రాజధాని వస్తుందన్న విషయాన్ని 2014 జూన్ 9న ప్రమాణస్వీకారం చేయగానే నాటి ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారని తెలిపింది.
ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న విషయం ఈ కేసులో పిటిషనర్లకు, వారికి భూములు అమ్మినవారితో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసంది. ‘‘ఈ కేసులో పిటిషనర్లపై ప్రభుత్వం ఊహాజనితమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఒడిగట్టిందన్నది నిస్సందేహం. చట్టం దానికి అనుమతించదు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే పిటిషనర్లను ప్రాసిక్యూట్ చేయడానికి పోలీసులు చీకట్లో బాణం వేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు’’ అని తన 87 పేజీల తీర్పులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ పేర్కొన్నారు. ‘‘ఈ దేశ పౌరులుగా ఆస్తులు కొనడం పిటిషనర్లకున్న రాజ్యాంగపరమైన, న్యాయపరమైన హక్కు. దాని ప్రకారమే వారు భూములు కొన్నారు. భూముల యజమానులు కూడా ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే, రిజిస్టర్డ్ సేల్‌డీడ్స్ ద్వారానే భూములు అమ్మారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఆస్తుల క్రయవిక్రయాలను నేరపూరితంగా చిత్రించడం, పిటిషనర్లకు నేరాన్ని ఆపాదించడం కుదరదు’’ అని స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం ఇదీ..
ఏపీలో గత ప్రభుత్వంలోని ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాజధాని సమాచారాన్ని ముందే తెలుసుకున్న కొందరు వ్యక్తులు రాజధానిలో, ఆ చుట్టుపక్కల భూములు కొన్నారని వెలగపూడికి చెందిన సరివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. అక్కడ రాజధాని వస్తుందన్న సమాచారాన్ని భూమి యజమానులకు చెప్పకుండా దాచిపెట్టి భూములు కొని... వారు మోసానికి పాల్పడ్డారని, వారు భూములు కొన్న తర్వాత అక్కడ రాజధాని ప్రకటన రావడంతో.. భూముల ధరలు పెరగడం వల్ల లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలతో సురేశ్‌కి సంబంధం లేకపోయినా ఆ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సీఐడీ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 409, 406, 120-బి కింద పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఆ కేసులను కొట్టేయాలని కోరుతూ... వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీకృత సంతకందారులుగా ఉన్న సీహెచ్ గురు మురళీమోహన్, వి.వెంకటరాయవర్మ, లలిత సూపర్ స్పెషాల్టీస్ ఆస్పత్రి ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ పీవీ రాఘవశర్మ, హైదరాబాద్‌కు చెందిన కిలారు శ్రీహాస, కిలారు రాజేశ్, నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వి, గుడ్‌లైఫ్ ఎస్టేట్స్ మేనేజింగ్ పార్టనర్ కె.వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై ఇదివరకే విచారణ జరిపిన కోర్టు.. తన తీర్పును వాయిదా వేసి, మంగళవారం వెలువరించింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మరికొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రణతి, గింజుపల్లి సుబ్బారావు, కేఎస్ మూర్తి, పోసాని వెంకటేశ్వర్లు ఏకే కిశోర్‌రెడ్డి, ఎంవీ సుబ్బారెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ఇదో ఆసక్తికరమైన కేసు
‘‘ఇదో విచిత్రమైన, ఆసక్తికరమైన కేసు. బహుశా ఇలాంటి ఆరోపణలతో నమోదు చేసిన మొదటి కేసు ఇదే కావచ్చు. ఆరేళ్ల క్రితం పిటిషనర్లకు, విక్రయదారులకు మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీకి ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో నేరాన్ని ఆపాదిస్తూ... పిటిషనర్లను నేరస్తులుగా పేర్కొంటున్నారు’’ అని ఆ తీర్పులో ఏపీ హైకోర్టు పేర్కొంది. ‘‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి ఐపీసీ సెక్షన్లు వర్తించవు. సెబి చట్టంలోని 12-ఎ, 15-జి సెక్షన్లను పార్లమెంటు ఐపీసీలో చేర్చలేదు. నేర న్యాయ విజ్ఞానశాస్త్రానికి (క్రిమినల్ జ్యూరిస్‌ప్రుడెన్స్) ఇన్‌సైడర్ ట్రేడింగ్ తెలియని విషయం. పిటిషనర్లకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ భావనను వర్తింపజేయడం తప్పుగా ఆలోచించడమే’’ అని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లను... భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 420 (మోసగించడం), 406 (విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు శిక్ష), 409, 120-బి కింద నేరానికి పాల్పడ్డవారిగా పరిగణించలేమని తెలిపింది. భూములు కొనేటప్పుడు.. భవిష్యత్తులో ఆ భూముల విలువ పెరగడం వల్ల తమకు కలిగే ప్రయోజనాన్ని భూమి యజమానులకు చెప్పాలన్న నిబంధనేదీ లేదని తెలిపింది.
పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా వాస్తవాల్ని దాచిపెట్టారని భావించలేమని, ఐపీపీ సెక్షన్ 420 కింద దాన్ని మోసంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఆ లావాదేవీల వల్ల భూమిని అమ్మినవారికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టంచేసింది. ఎఫ్‌ఐఆర్‌తో పాటు పోలీసులు నిర్వహించిన దర్యాప్తులోనూ పిటిషనర్లు నేరానికి పాల్పడ్డారనే వివరాలేవీ వెల్లడి కాలేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై ఆరోపణతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ సమర్థనీయం కాదని, నేర న్యాయవిచారణ ప్రక్రియకు విరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనంది. హరియాణా ప్రభుత్వం వర్సెస్ భజన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లపై నమోదు చేసిన కేసును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సీఐడీ పోలీసులు పిటిషనర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ 49/2020, దాని ఆధారంగా జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఏపీ హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు ఇవీ..
- ఆ భూముల క్రయవిక్రయాలతో సంబంధం లేని వ్యక్తి తమపై ఫిర్యాదు చేయడం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయని, తమను అన్యాయంగా ప్రాసిక్యూట్ చేయడానికే పిటిషనర్ అసత్యాల్ని గుదిగుచ్చారని పిటిషనర్లు చేసిన వాదనను తోసిపుచ్చలేం.
- పిటిషనర్లకు భూములు అమ్మినవారికి నిజంగానే అన్యాయం జరిగితే వారు ఇదివరకే సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసేవారు. రాజధానిని ప్రభుత్వం 2014 డిసెంబరు 30న నోటిఫై చేసింది. అది జరిగి కూడా ఆరేళ్లయింది.
- తమకు భూములు అమ్మాలని పిటిషనర్లు... భూముల యజమానులను సంప్రదించలేదు. భూముల యజమానులే తమ అవసరాల కోసం వాటిని అమ్ముతామని ముందుకొచ్చారు. పిటిషనర్లు భూములు కొన్నారు. ఆ విషయం భూముల విక్రయ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. పిటిషనర్లు వాస్తవాల్ని దాచిపెట్టి.. భూముల యజమానుల నుంచి భూములు కొన్నారన్న ప్రాసిక్యూషన్ వాదన వాస్తవం కాదని తేలిపోయింది.
- విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణానది పక్కన రాజధాని వస్తుందని పిటిషనర్లకు, భూములు విక్రయించిన వారికే కాదు... ప్రపంచం మొత్తానికి తెలుసు. విభజన చట్టం కింద 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ డే. 2014 జూన్ 9న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాజధాని నగరం.. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా నది పక్కన వస్తుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు, ఆంగ్ల దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అందువల్ల రాజధాని ఏర్పాటు గురించిన సమాచారం అందరికీ 2014 జూన్ నుంచే తెలుసు. పిటిషనర్లు అనధికారికంగా సమాచారం సేకరించి రాజధాని వచ్చేచోట భూములు కొన్నారని చెప్పడానికి వీల్లేదు. భూములు అమ్మినవారికీ రాజధాని నగర ఏర్పాటు ప్రతిపాదన గురించి తెలుసు. ఈ నేపథ్యంలో వాస్తవాలు దాచిపెట్టి పిటిషనర్లు కొన్నారని చెప్పడానికి వీల్లేదు. ఐపీసీ 420 కింద నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదు.
- దర్యాప్తు అధికారులు సీడీతో పాటు అందజేసిన ప్లాన్ ప్రకారం చూసినా... రాజధాని ప్రాంతంలో పిటిషనర్లతో పాటు ఇంకా చాలామంది భూములు కొన్నారు. బహుశా పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగానే వారూ భూములు కొని ఉంటారు.
- కుట్ర జరిగిందన్న ఓ కథను పోలీసులు ఊహాజనితంగా అల్లి పిటిషనర్లపై ఐపీసీ 120బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. అది చెల్లుబాటు కాదు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలను పోలీసుల బలహీనమైన వాదనలు ఆధారంగా చేసుకొని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.
- పోలీసుల విచారణలోనూ పిటిషనర్లు మోసానికి పాల్పడినట్లు ఆధారాలు చూపలేకపోయారు. ఎఫ్‌ఐఆర్ వివరాల్లోనూ కాగ్నిజబుల్ నేరానికి పిటిషనర్లు పాల్పడినట్లు లేవు.
- ఎఫ్‌ఆర్‌ఐలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అసంబద్ధం. వివేకం ఉన్న వ్యక్తి ఎవరైనా వాటి ఆధారంగా.. పిటిషనర్లపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అవసరమైన ప్రాతిపదిక ఉందన్న నిర్ణయానికి రారు. పిటిషనర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌ను రద్దు చేస్తున్నాం.
ఇదీ చదవండి: దక్కన్ కళలు, సంస్కృతికి దర్పణంగా ‘అదర్ కోహినూర్స్’