High Court on Kodipandalu: సంక్రాంతి సందర్భంగా కోడిపందేల వ్యవహారంపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ తరఫున సహాయ న్యాయవాది కోర్టుకు వివరించారు. జూదం జరగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. సెక్షన్ 144 విధించామన్నారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. ఇదే వ్యవహారంపై దాఖలైన మరో వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ కె.సురేశ్ రెడ్డి.. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో కోడి పందేలు, జూదం, అసాంఘిక కార్యకలాపాలను నిలురించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ.. కొప్పాక విజయ్ కుమార్, వి. రాజవర్ధనరాజు.. హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయవాది పి.రమరాయుడు వాదనలు వినిపిస్తూ.. కోడిపందేలను నిలువరించాలని 2017లో హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తీర్పునకు కట్టుబడి వ్యవహరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏజీపీ చెప్పిన విషయాల్ని నమోదు చేశారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.
ఇదీ చదవండి.. Barking Deer: 15 ఏళ్ల తర్వాత.. ఉనికి చాటుకున్న మొరిగే జింక