GO ON Cinema Tickets in ap: సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. ఈ బాధ్యతను ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కి అప్పగించింది. ఐఆర్‌సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొంది.
ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా ఏపీఎస్ ఎఫ్‌టీవీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ని నియమించింది. ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కార్యాచరణ ప్రారంభంచిన ప్రభుత్వం.. ఇప్పటికే ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థలతో చర్చలు జరిపింది. థియేటర్లతో ప్రైవేట్ టికెటింగ్ ఏజెన్సీల ఒప్పందాలపై ప్రణాళిక ఖరారు చేస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు ఇబ్బంది లేకుండా కార్యాచరణ రూపొందిస్తోంది. ఒప్పందాలతో సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. మరో 2 నెలల్లో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కేవలం పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. జీవో నెం.142ను తీసుకురావటం విశేషం.
ఇవీ చూడండి: Online Cinema Tickets in AP: ఆన్లైన్లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: పేర్ని నాని