ఏపీ ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో కరోనా కేసులకు కళ్లెం పడడంలేదు. రికార్డుస్థాయిలో గురువారం ఒక్కరోజే 80 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 893కు చేరింది. కరోనా వ్యాప్తి చెందిన నాటి నుంచి ఒకేరోజు ఇన్ని కేసులు వెలుగుచూడటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 31, గుంటూరు జిల్లాలో 18 కొత్త కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 27కు పెరిగింది. కరోనా నుంచి కోలుకోవడం వల్ల మరో 21 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు.
ఐసీఎమ్ఆర్ సూచనల మేరకు ర్యాపిడ్ పరీక్షలు
కరోనా నిర్థరణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా వ్యాధి లేదనే ఉదాసీనత తగదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొలుత నెగిటివ్ వచ్చినా ఆ తర్వాత పాజిటివ్‌గా తేలిన సందర్భాలు ఉన్నాయన్నారు. కొందరిలో 28 రోజుల వరకూ లక్షణాలు బయటపడం లేదని తెలిపారు. అనుమానిత ప్రదేశాల్లో వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకే ఐసీఎమ్ఆర్ సూచనల మేరకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్య ,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. అయితే వైరస్ నిర్ధరణకు వైరాలజీ ల్యాబ్‌లో జరిగే పరీక్షలే ప్రామాణికమని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ప్రకారం రాష్ట్రంలో 56 మండలాలు రెడ్‌జోన్‌లో, 47 ఆరెంజ్ జోన్‌లో ఉండగా...మిగిలినవి గ్రీన్‌జోన్‌లో ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ