లాక్డౌన్తో నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఆర్థిక సాయమందిచే ఆలోచన ఏమైనా ఉందా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి ప్రణాళిక ఏదైనా ఉంటే ఈ నెల 10వ తేదీలోగా తెలపాలని న్యాయస్థానం సూచించింది. లాక్డౌన్తో ఇబ్బందిపడుతోన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ... న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. లాక్డౌన్ సమయంలో కఠిన నిబంధనలతో చేనేత ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కార్మికుల కష్టమంతా వారి గోదాముల్లో కుప్పలుగా పేరుకుపోయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది రంగయ్య తెలిపారు.
పోగుపడిన చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రభుత్వం లేదా సహకార సంఘాలు ఏం చర్యలు తీసుకున్నాయో వివరించాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు రాష్ట్రంలో ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు? వారికి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... పిటిషన్పై తదుపరి విచారణ ఈనెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : వచ్చే వారం నుంచి విస్తారంగా వర్షాలు: ఐఎండీ