రాష్ట్రంలో పంటల కొనుగోలుకు సంబంధించి సహకార సంఘాల్లో జరుగుతోన్న అవినీతిపై కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో వరి పంట 50 శాతం కోతలు పూర్తై కల్లాల్లో ఉందని.. ఇటీవల కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిచిందని లేఖలో వివరించారు. ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మిల్లర్లతో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల్లోనే రైతుకు తూకం రషీదు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గత వానాకాలంలో మొక్కజొన్న పంటను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు క్వింటాల్ రూ.900 నుంచి రూ.1200కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాసంగిలో ప్రభుత్వమే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, పిడుగులు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
సహకార సంఘాల్లో అవినీతి..
సహకార సంఘాల్లో అవినీతి పెరిగిపోతోందని.. మెదక్ జిల్లా కోనాపూర్ సహకార సంఘంలో దాదాపు రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ సంఘం సభ్యులే ఆధారాలతో ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఖమ్మం సహకార బ్యాంకులోనూ రూ.7 కోట్ల అవినీతి జరిగిందని, నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్‌లోనూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.