కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించేందుకు కళాకారులు, కవులు ముందుకు వస్తున్నారు. పాటలు, చిత్రాలతో సందేశాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అన్షుల్ సిన్హా సైతం తనదైన శైలిలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంట్లోని వస్తువుల్ని తన చిత్రంలోని పాత్రలుగా వాడుకుంటూ మూడు లఘు చిత్రాలతో మరోసారి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలందుకుంటున్నారు.
మూడూ ప్రయోగాత్మకమే..
కొవిడ్-19 తీవ్రతను అర్థం చేసుకునేందుకు అన్షుల్ తీసిన మొదటి చిత్రం ‘హ్యూమన్ వర్సెస్ కొవిడ్’ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆదరణ పొందుతోంది. ఇంట్లోని డైనింగ్ టేబుల్‌పై ఉండే స్పూన్లను మనుషులుగా, ఫోర్కులను కొవిడ్ క్రిములుగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు.
ఓ వ్యక్తి ఇంటి నుంచి బయట అడుగుపెట్టగానే పక్కన మొత్తం చావు ఏడుపులు పెద్దఎత్తున వినిపిస్తుంటాయి. బయట అడుగుపెడితే వచ్చే నష్టంపై అవగాహన కల్పిస్తూ ‘స్టెప్‌అవుట్’ పేరుతో నిర్మించిన రెండో చిత్రమది. మూడో చిత్రం ‘లాక్‌డౌన్’లో ఇంటి తలుపు తీయగానే కనిపించే శవాల కుప్పలను చూపించే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తితో పాటు, సమాజానికి కలిగే నష్టాన్ని ఇందులో చూపించారు.
ఆసక్తి చూపరనే నిడివి తక్కువ..
‘‘ఈ మూడు లఘు చిత్రాలు కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్నవే. ఎక్కువసేపు చెప్పే విషయాలకు జనం ఆసక్తి చూపరనే దీన్ని ఎంచుకున్నాను. నిర్మించే చిత్రాలకు ఎలాంటి భాష లేకపోవడంతోపాటు అన్నీ సందేశమిచ్చేవి కావడంతో ప్రపంచ దేశాల వేదికపై ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని.. నావంతు బాధ్యతగా ఇంట్లోనే ఉండి ఈ చిత్రాలు నిర్మించాను. దీనికోసం ప్రత్యేక సెట్లు ఏర్పాటు చేసుకున్నాను.’’
-అన్షుల్ సిన్హా, దర్శకుడు
ఇవీచూడండి: రాష్ట్రంలో 487కు చేరిన కరోనా కేసులు