కొవిడ్ (Covid) సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాలు నిలదక్కుకోగలిగినా... పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు (Farmers) అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షల కారణంగా మరిన్ని నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థుతుల్లో అన్నదాతలను ఆదుకోవటానికి ఓ రైతు ముందుకొచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ సేంద్రీయ రైతు పురుషోత్తమరావు (Organic farmer Purushotthamarao) 20 శాతం రాయితీపై 25 వేల ప్యాకెట్లు బోల్‌గార్డ్-2 పత్తి రకం విత్తనాలు, 5 వేల సంకర మిరప ప్యాకెట్లు అందించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ పంపిణీకి శ్రీకారం చుట్టారు.
రాయితీపై విత్తనాల పంపిణీ...
రైతులకు రాయితీపై విత్తనాలు (Subsidy Seeds) పంపిణీ చేసేందుకు గాను మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రాయితీ మెుత్తాన్ని తానే భరిస్తానని పురుషోత్తమరావు తెలిపారు. విత్తానాలు కావాల్సిన రైతులు... 7207501515 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా వివరాలు పంపితే కార్గో సర్వీసు సాయంతో విత్తన ప్యాకెట్లు చేరవేస్తామని వెల్లడించారు. పత్తి, మిరప విత్తన ప్యాకెట్లే కాకుండా ప్రత్యేకించి పత్తిలో గులాబీ పురుగు, కత్తెర పురుగు నివారణకు ఉపయోగించే లింగాకర్షక బుట్టలు, లూర్స్‌ను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తామని వివరించారు.
విస్తృతంగా సేవలు...
బహిరంగ మార్కెట్‌లో 450 గ్రాముల పత్తి ప్యాకెట్ ధర.. రూ.767 ఉండగా రవాణా ఖర్చులతో కలుపుకొని రైతుకు వెయ్యి ఖర్చువుతుంది. ఆ విత్తనాలను రూ. 610కే అందిస్తామని పురుషోత్తమ రావు తెలిపారు. 10 గ్రాముల మిరప ప్యాకెట్ ధర రూ. 400 నుంచి 450 ఉంటే... రూ. 300 చొప్పున ఇస్తున్నారు. రైతుల నుంచి వచ్చే డిమాండ్ బట్టి సేవలు మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.