Police Physical tests for TS Pregnant women : పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకునే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య కారణాల వల్ల దైహదారుఢ్య పరీక్షలకు హాజరు కాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం ఇచ్చింది. ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన గర్భిణీలు, బాలింతలకు మరోసారి ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే ఛాన్స్ కల్పించింది.
Police Physical tests for Pregnant women in Telangana : మెయిన్స్‌లో అర్హత పొందాక గర్భిణీలు, బాలింతలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భం దాల్చిన స్త్రీలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ గురువారం రోజున కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. 2022 సెప్టెంబర్ లో పోలీస్ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి ఈవెంట్స్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈవెంట్స్‌కు హాజరయ్యే మహిళలు 40 మంది గర్భిణీ స్త్రీలు కావడంతో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కరీంనగర్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ముందు ధర్నా చేపట్టారు.
గతంలో 11 మంది మహిళలు కోర్టుకు వెళ్లిన దృశ్యా వారికి అనుమతి ఇచ్చారని తమకు కూడా అలాగే అనుమతి ఇవ్వాలని గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 40 మంది గర్భిణీ స్త్రీలు ఆందోళన చేపట్టడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు ట్రాఫిక్‌లో అంతరాయం కలిగింది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సీఐ మాధవి చేరుకొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ధర్నా చేపట్టిన గర్భిణీ స్త్రీలు ఆందోళనలను విరమించారు.
మహిళల ఆందోళనతో దిగొచ్చిన పోలీసు నియామక మండలి వారికి గుడ్ న్యూస్ చెప్పేసింది. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిజికల్ పరీక్షలకు హాజరు కావొచ్చని స్పష్టం చేసింది.