సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను అరెస్టు చేసినప్పటికీ... ఆ మేరకు అభియోగపత్రాలు దాఖలు చేయడంలో ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు బెయిలు కూడా మంజూరైంది.
ఆధారాల సేకరణలో ఇబ్బందులు...
ఐఎంఎస్ మందుల కుంభకోణం కేసులో అభియోగపత్రాల దాఖలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సాగిన కుంభకోణంలో సాక్ష్యాలు, ఆధారాల సేకరణలో అనిశా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ కారణంగానే నిందితులందరికీ బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిందితులకు బయటకు వెళ్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
16 మంది అరెస్ట్...
బోగస్ ఇండెంట్లు, డొల్ల కంపెనీలు, ఉత్తుత్తి ఆరోగ్య శిబిరాలు వంటి వేర్వేరు అంశాలపై అనిశా అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. దేవికారాణి, పద్మ వంటి కీలక నిందితులకు మూడు కేసుల్లోనూ ప్రమేయం ఉండగా, కొందరు రెండు కేసులు, మరొకరు ఒక్క కేసులో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో బాబ్జీ, సుధాకర్‌రెడ్డి, నాగలక్ష్మి తదితర ఎనిమిది మంది నిందితులకు బెయిలు మంజూరైంది. ఇప్పటివరకు ఒక్క కేసులోనూ అభియోగపత్రం దాఖలు కాకపోవడంతో బెయిళ్లు మంజూరయ్యాయి.
జాప్యమైనా... బలమైన అభియోగాలు
కేసు దర్యాప్తులో చిక్కుముళ్లు ఉండటం వల్ల అభియోగపత్రాల దాఖలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తవ్విన కొద్దీ... అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేసులను కొలిక్కి తేవడం అంత సులభంగా కనిపించడం లేదు. కొంత జాప్యం జరిగినా నిందితులపై బలంగా అభియోగాలను నమోదు చేయాలని అనిశా అధికారులు భావిస్తున్నారు. కేసులో అనిశా దర్యాప్తు మొదలు పెట్టకముందే విజిలెన్స్ విచారణ జరపడం వల్ల నిందితులు సాక్ష్యాధారాలు లభించకుండా చేసినట్టు ప్రచారం సాగుతోంది. బెయిలు మంజూరైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అనిశా ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం