దళితబంధు (Dalitha Bandu) అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు తెలిపారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్... ఎస్సీల ఆర్థిక సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) తీసుకున్న చారిత్రక నిర్ణయం దళితబంధు పథకమని అన్నారు. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా పథకం అమలు, పర్యవేక్షణ పటిష్ఠం చేసి విజయవంతం చేయడంలో మనసుపెట్టి కృషి చేయాలని ప్రతినిధులను కోరారు.
మానవీయ నిర్ణయం...
చిన్నలోన్ కోసం ఇబ్బందులు పడిన ఎస్సీలకు దళితబంధు ద్వారా ఉపాధి కోసం రూ. పది లక్షలు పూర్తి ఉచితంగా ఇవ్వడం గొప్ప మానవీయ నిర్ణయమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. అంబేద్కర్ తర్వాత ఎస్సీల గురించి ఆలోచన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్న ఆయన... అణచివేతకు గురైన ఎస్సీలు అభివృద్ధి చెంది, వివక్షను అధిగమించి ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవంతో నిలిచినప్పుడే సీఎం కేసీఆర్‌కు నిజమైన కృతజ్ఞత తెలిపిన వాళ్లమవుతామని చెప్పుకొచ్చారు.
ఎస్సీల జీవితాల్లో మౌలిక మార్పుకు శ్రీకారం చుట్టి సామాజిక వివక్షతల అంతానికి చరమగీతం పాడాలని... వెలివాడల వాకిళ్లలో వెన్నెల్లే కురువాలని గోరటి వెంకన్న కవితాత్మక సందేశం వినిపించారు. దళితబంధు పథకంతో ఎస్సీలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతారన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్... అణగారిన జీవితాల్లో వెలుగులు నింపే సాహసోపేత పథకం తెచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 60 లక్షల మంది ప్రజల జీవితాలల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయంపై ఆధారపడి ఉందన్నారు.
నోడల్ ఏజెన్సీ నియమించండి...
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన గొప్ప ఆలోచనకు జాతి రుణపడి ఉంటుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలని కోరారు. ఎస్సీ ప్రజాప్రతినిధులను పైలట్ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టినా విజయవంతం అవుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటి లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.
ఇదీచూడండి: CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'