ప్రశాంతంగా ఉండే ఆ పల్లెల్లో ఇప్పుడు ఉద్యమ రణనినాదాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం తప్ప ఏమీ తెలియని రైతులు... గత కొన్ని రోజులుగా ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. బతుకు కోసం, భవిష్యత్తు కోసం వందో రోజూ ఆందోళన చేస్తున్న ఏపీలోని అమరావతి ప్రజలు.. ఆంధ్రా ప్రభుత్వం తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని పోరాడుతున్నారు.
సీఎం ప్రకటనతో మెుదలై...!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34,322 ఎకరాలను 29 వేల 881 మంది రైతులు భూ సమీకరణలో భాగంగా ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే. ప్రభుత్వం మారినా రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో ఏపీ సీఎం జగన్ బయటపెట్టిన 3 రాజధానుల ఆలోచన శరాఘాతంలా తగిలింది. ఆ మర్నాటి నుంచి రాజధానిలో ఉద్యమం మెుదలైంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో మొదలై క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది. రాజధాని రైతుల పోరాటానికి అధికార వైకాపా తప్ప, అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచీ రైతులు, రైతు నాయకులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.
వినూత్నంగా ఆందోళనలు..
ఏపీ రాజధాని రైతులు ఉద్యమం మొదలు పెట్టిన ఈ 100 రోజుల్లో ఎక్కడా హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడలేదు. తమ గోడుని, ఆవేదనను, ఆందోళనను ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వినూత్న మార్గాల్లో ఉద్యమం కొనసాగిస్తున్నారు.
ఉద్యమంలో ముఖ్య ఘట్టాలు...
- మొదట్లో రోడ్లపైనే నిరసన తెలియజేశారు. క్రమంగా పలు చోట్ల రోడ్ల మీదే వంటావార్పు చేపట్టి రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామ సచివాలయాలకు నల్లరంగు పూసి నిరసన తెలిపారు.
- రోడ్లపై నిరసనలు తెలియజేయకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రైవేటు స్థలాల్లో శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు.
- ఆంధ్రా రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి మందడంలోని దీక్షా శిబిరం వరకు రైతులు, రైతుకూలీలు, మహిళలు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. జెండాలు పట్టుకుని వేల సంఖ్యలో ప్రజలు ఒక ప్రవాహంలా కదిలారు.
- ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకుని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాదయాత్రగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
- మందడంలోని నిరసన శిబిరంలో దీక్ష చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు మహిళలపై దాడిచేయడంతో, ఒక మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో పోలీసుల వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- జాతీయ మహిళా కమిషన్ బృందం రాజధాని గ్రామాలు, గుంటూరు, విజయవాడ నగరంలో పర్యటించి బాధితుల నుంచి వినతులు స్వీకరించింది.
- అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జాతీయ రహదారిని దిగ్బంధించారు. పలువురు రైతులపై పోలీసులు కేసులు పెట్టారు.
- ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దాదాపుగా అసెంబ్లీ వరకు చేరుకున్నారు. రైతులతో పాటు ముట్టడిలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేశారు. మహిళలు, రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బంద్ పాటించారు.
- ఏపీ రాజధాని ఉద్యమం మొదలైన తర్వాత పలువురు రైతులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అమరావతి జేఏసీ చెబుతున్న లెక్కల ప్రకారం...రాజధాని తరలి పోతుందన్న ఆవేదనతో సుమారు 60 మంది రైతులు మృతి చెందారు.
కరోనా ప్రభావంతో ఇళ్లల్లోనే నిరసనలు
ఉగాదికి కళకళలాడే రాజధాని గ్రామాలు ఈసారి నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి వరకు తక్కువ మందితో నడిచిన శిబిరాలు బుధవారం ఖాళీ అయ్యాయి. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు, రైతు కూలీలు తమ నిరసనలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేశారు. బుధవారం నాటికి ఉద్యమం 99వ రోజుకు చేరుకుంది. పలు శిబిరాలలో ఉదయం నలుగురైదుగురు రైతులు వచ్చి కూర్చున్నారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో బయటకు రావడం క్షేమకరం కాదని పోలీసులు అభ్యంతరం చెప్పి, ఇళ్లకు పంపించారు. శిబిరాలకు ఎవరూ రావొద్దని, ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు తెలపాలని ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు.. రైతులు, మహిళలు గృహాల్లోనే మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ప్రధాని సూచన మేరకే తాము ఉద్యమాన్ని పరిమితంగా చేస్తున్నామని, యథావిధిగా న్యాయ పోరాటం చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు వీధుల్లోకి వచ్చి జై అమరావతి అని నినాదాలు చేశారు. పెదపరిమిలోని శివాలయంలో కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. వంద రోజుల ఉద్యమంలో ఎవరికీ రాకూడనన్ని కష్టాలు తమకు వచ్చాయని, అనేక మందిపై పోలీసులు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుదీర్ఘ ఉద్యమాల్లో ఇదీ ఒకటి..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిన సుదీర్ఘమైన ఉద్యమాల్లో అమరావతి ప్రజలు చేస్తున్న పోరాటం కూడా ఒకటి. మిగతావన్నీ ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయి.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'