Amit Shah Telangana tour Schedule : తెలంగాణలో తమ పార్టీ బలోపేతం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్తుంటే.. మిగతా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూ ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరికలపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Amit Shah Telangana tour News : ఈనెల 23న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు షా పర్యటన, సమావేశం ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణలో అమిత్ షా పర్యటన పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పర్యటన మాత్ర పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే షా పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్ర నేతలు ప్రకటించారు.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
- ఈ నెల 23న ఎల్లుండి మ.3.30 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
- సాయంత్రం 4 గం.కు ఆస్కార్ విజేతలతో అమిత్‌షా తేనీటి విందులో పాల్గొంటారు
- సాయంత్రం 5.15 గం.కు నోవాటెల్ నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళ్తారు.
- అక్కడ పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సాయంత్రం 6 గంటలకు అమిత్ షా పాల్గొంటారు.
- అనంతరం రాత్రి 7.50 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమవుతారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో క్షణానికో రకంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో అమిత్ షా తెలంగాణ పర్యటన ఈసారైనా ఉంటుందా లేదా అనే అనుమానం ఉండేది. అయితే తాజా షెడ్యూల్‌తో షా పర్యటన పక్కాగా ఉంటుందని తేలింది. ఈ పర్యటనలో షా రాష్ట్ర నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే గాక.. అధికార బీఆర్ఎస్‌పై ఎలాంటి వ్యూహం అమలు చేయాలో నాయకులు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా సమక్షంలో ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు ఉన్నా బీజేపీ.. జాతీయ నాయకులను అస్త్రంగా వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే.