Amit Shah on Telangana assembly elections 2023: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణపైనే ఇకపై తమ దృష్టి ఉంటుందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో.. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో కలిసి.. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటి నేతలతో అమిత్ షా చర్చలు జరిపారు.
Amit shah on BJP Corner Meetings : రాష్ట్రంలో.. బీజేపీ గెలుపే లక్ష్యంగా నేతలంతా కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. పాత, కొత్త తేడా ఉండకూదని దిశానిర్దేశం చేశారు. అభిప్రాయబేధాలుంటే.. కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప.. వివాదాలకు తావు ఇవ్వొదని తెలంగాణ నాయకులను అమిత్ షా హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు, వాటిపై ఉద్యమించే ప్రణాళికతో.. ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీలో చేరికలు నెమ్మదించాయని.. నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలే ఇందుకు కారణమని తమ దృష్టికి వచ్చిందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.
తెలంగాణలో 15రోజులకు ఒకసారి పర్యటన చేస్తా: ప్రస్తుతం పార్టీకి అభ్యర్థులు లేని నియోజకవర్గాలపై.. ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అభ్యర్ధులు బలహీనంగా ఉన్న చోట్ల బలమైన వారు దొరికితే చేర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేందుకు ఇంకా 7 నెలల సమయమే ఉందన్న అమిత్‌షా.. ఎన్నికలు ముందే వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. ఇకపై తాను తెలంగాణలో తరచూ పర్యటిస్తానని.. అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. అవకాశం ఉంటే ప్రతి 15 రోజులకోసారి వస్తానని వెల్లడించారని సమాచారం. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించానని అందులో మొదటి ప్రాధాన్యం తెలంగాణకేనని ఆయన చెప్పినట్లు తెలిసింది.
ఈనెల 12న హైదరాబాద్‌కు షా: బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి.. ప్రచారం చేయాలని సూచించారు. 119 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించాలని, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని.. షా సూచించినట్లు తెలిసింది. ఆఖరున భారీ బహిరంగసభ నిర్వహించి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని.. సూచించినట్లు సమాచారం. ఈనెల 12న హైదరాబాద్‌కు రానున్నట్లు చెప్పిన అమిత్ షా.. మరోసారి అక్కడ కలుద్దామని తెలిపారు. కార్యక్రమాలను ఖరారు చేయడం, వాటిపై ప్రణాళిక రూపొందించే విషయంలో.. బీజేపీ పార్టీ అధ్యక్షుడికి స్వతంత్రత ఇచ్చినట్లు తెలిసింది.
స్ట్రీట్ కార్నర్ సమావేశాలు విజయవంతం: స్ట్రీట్‌కార్నర్ సమావేశాలు విజయవంతం కావడంపై కేంద్ర నాయకత్వం అభినందనలు తెలిపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉద్యమించాలని సూచించారని చెప్పారు. గతంలో రెండు ఎంపీ సీట్లున్న తాము దేశంలో ఎలా అధికారంలోకి వచ్చామో.. తెలంగాణలోనూ అలాగే గెలుస్తామని సంజయ్ స్పష్టంచేశారు.
దిల్లీ మద్యం కేసుపై బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించలేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని సంజయ్ అన్నారు. దిల్లీ మద్యం విధానంలో కుమార్తె కవిత పాత్రపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మనీశ్ సిసోదియా అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. కవిత పేరు ఛార్జిషీట్లలో వచ్చినా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
"రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న కార్యక్రమాల విషయంలో కేంద్ర నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై ప్రధానంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్- బీఆర్ఎస్లు ప్లాన్ ప్రకారం బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: