ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనకు అలవాటైన కుల రాజకీయాలను అమరావతి ప్రజలపై రుద్ది, వారిలో విద్వేషాలు రగిలించాలనుకోవడం దారుణమని అమరావతి పరిరక్షణ సమితి-జేఏసీ మండిపడింది. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే... కొందరు కులాల మధ్య అసమతౌల్యం ఏర్పడుతుందని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారంటూ జగన్ శుక్రవారం ఒక సభలో చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు శనివారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతుల్లో 44 శాతం మంది బలహీనవర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు.
మీ కుట్రను అడ్డుకునేందుకే కోర్టుకెళ్లాం
పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ఆ లేఖలో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ‘‘రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో అమరావతిని చంపేయాలన్న మీ కుట్రను, దురుద్దేశాన్ని అడ్డుకోవడమే మా ఉద్దేశం. రైతుల నుంచి తీసుకున్న భూమిలో, భవిష్యత్ అవసరాల కోసం అట్టిపెట్టిన దాన్ని పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలన్న మీ నిర్ణయం వెనుక అమరావతిని సర్వనాశనం చేయాలన్న కుట్ర దాగుంది. మీ కుతంత్రాల్ని అడ్డుకోవాలనే న్యాయస్థానాన్ని ఆశ్రయించామే తప్ప... మేం పేదలకు, ఏ కులానికీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ‘డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్’ అన్న పదానికి.. ‘కులాల అసమతౌల్యం’ అని వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరం. రాజధాని అమరావతిలో ఎక్కువ భాగం ఉన్న తాడికొండ... ఎస్సీ నియోజకవర్గం కావడం మీ దృష్టిలో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్సా? రాజధాని గ్రామాల పరిధిలోని జనాభాలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉండటం మీ దృష్టిలో కులాల అసమతౌల్యమా?’’ అని ప్రశ్నించారు.
మీరొచ్చాకే కులాల చిచ్చు..!
'మీరు అధికారంలోకి వచ్చేంత వరకు రాజధాని ప్రాంతంలో ఏ కులం వారు ఎక్కువ మంది ఉన్నారన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. అలా ఆలోచించాల్సిన అవసరమూ అక్కడి వారికి రాలేదు. మీరు అధికారంలోకి వచ్చాకే... మీకు అలవాటైన కుల రాజకీయాల్ని అక్కడ కూడా రుద్దాలని చూస్తున్నారు. అన్ని కులాల వారు శాంతియుత సహజీవనం చేస్తున్న అమరావతిపై కులం ముద్ర వేసి చంపేయాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల చిన్న రాష్ట్రమైపోయిందని, మళ్లీ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం వ్యక్తిగతంగా, వైకాపా అధ్యక్షుడిగా మీకు ఇష్టం లేదని నాడు చెప్పారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక... దేవాలయం లాంటి శాసనసభలో చేసిన ప్రకటన మర్చిపోయి మూడు రాజధానుల అంశం తెర మీదకు తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు...' అని జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు పేర్కొన్నారు. రాజధానిలో గత ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల కోసం సుమారు ఐదు వేల ఇళ్లు నిర్మించిందన్న విషయం తెలిసి కూడా... వాటిని ఇంతవరకూ లబ్ధిదారులకు ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. ఆ ఇళ్ల లబ్ధిదారుల్లో అన్ని వర్గాలకు చెందిన వారూ ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని చెప్పారు.
వ్యక్తులపై ద్వేషంతో వ్యవస్థను నాశనం చేస్తున్నారు
'అమరావతి ప్రాంత రైతులకు, ప్రభుత్వానికి మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మీరు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలనే మేం వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏడాదిన్నర కాలంగా అమరావతిపై అబద్ధాలు చెబుతూ...మీరు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని రాజధాని లేని రాష్ట్రంగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. వ్యక్తులపై ద్వేషంతో వ్యవస్థను నాశనం చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించాలి. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్న మీరు... వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించకుండా... ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధాని చేయాలనుకోవడం వెనుక మీ స్వార్థ ప్రయోజనాలు ఏమున్నాయో బహిర్గతం చేయాలి...' అని జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు. 'మీరు, మీ మంత్రులు ఇకనైనా అబద్ధాలు ప్రచారం చేయడం మానేయండి. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడండి..' అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.
44 శాతం మంది బలహీనవర్గాల వారే
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో ఏ సామాజికవర్గానికి చెందిన వారెంత మంది ఉన్నారన్న వివరాలను తమ లేఖతో పాటు జేఏసీ నాయకులు విడుదల చేశారు.
ఇదీ చదవండి: భూమి కోసం.. పెదనాన్నను పొట్టన పెట్టుకున్నాడు!