Budget Allocations for Electricity Department: అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించిందని తెలిపారు. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్లో రూ.12,727 కోట్లు ప్రతిపాదించినట్లు హరీశ్‌రావు వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషి వల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్ రంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం రూ.38,070 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు.
''అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం రూ.38,070 కోట్లను ఖర్చు చేసింది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉంది. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం.. జాతీయ తలసరి వినియోగం కన్నా 69 శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణం.''-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
అప్పటి కల్లా ఆ ప్లాంటు నుంచి విద్యుదుత్పత్తి..: ఈ క్రమంలోనే భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని హరీశ్‌రావు తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైందన్న ఆయన.. దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు వచ్చాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు.
అది మనకు గర్వకారణం..: ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,741 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతోందని స్పష్టం చేశారు. తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేదని.. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగిందని తెలిపారు. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉందని వివరించారు. అంటే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం.. జాతీయ తలసరి వినియోగం కన్నా 69 శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణమన్నారు.
ఇవీ చూడండి..