జీహెచ్ఎంసీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. సాధారణ పరిశీలకులుగా నియమితులైన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఆరుగురు సాధారణ ఎన్నికల పరిశీలకులు జోన్లలో విధుల్లో చేరినట్లు తెలిపారు. పర్యవేక్షణ మరింత మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఒక్కో జోన్‌కు ఇద్దరు సాధారణ పరిశీలకులు నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కళ్లు, చెవులవలె పనిచేయాలి..
పోలింగ్, ఓట్ల లెక్కింపు రోజున సమర్పించే నివేదికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయన్న పార్థసారథి సాధారణ పరిశీలకులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి... ఎస్ఈసీకి కళ్లు, చెవులవలె పనిచేయాలని నిర్దేశించారు. ఎన్నికల ఖర్చు నియంత్రణ, చెక్‌పోస్టులు, పికెట్‌లలో పరిస్థితులు పర్యవేక్షించాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసుశాఖ గుర్తించాలని సూచించారు. ఉద్యోగులు, స్టాఫ్ జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని వివిధ హెచ్ఓడీ, స్పెషన్ చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీలకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.
పార్టీల ప్రచారతారలు..
నామినేషన్ల ఘట్టం పూర్తవడం వల్ల రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమైన ప్రధాన పక్షాలు ప్రచారంపైనా... దృష్టి కేంద్రీకరించాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసం పది మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్ల జాబితాను.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా 10 మంది మంత్రులతో ప్రచారతారల జాబితాను తెరాస.. ఎన్నికల సంఘానికి సమర్పించింది. భాజపా స్టార్ కాంపెయినర్ల జాబితాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారతారల జాబితాలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్లు.. ఇవాళ రూ. 25.5 లక్షల నగదును సీజ్ చేశాయి. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందగా ఈ మొత్తం సీజన్ చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల 18 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 21వేల 800 రూపాయలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.