రాష్ట్రంలోని 11 బొగ్గుగనుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ముగ్దూం భవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెదేపా, తెజస, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని కలవటమే కాకా... సింగరేణి భవన్ ముందు ధర్నా చేయాలని తీర్మానం చేశారు.
ఒక వైపు కర్ణాటక అతలాకుతలం అవుతుండగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కార్మిక సంఘాలు చేపట్టనున్న ఏ ఆందోళనకైనా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
సందట్లో సడేమియాలాగా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. కార్మిక ప్రయోజనాల కోసం, బొగ్గుగనుల పర్యవేక్షణ కోసం తెదేపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. సింగరేణి ఆదాయపరంగా అభివృద్ధి కావడమే కాకుండా సామాజిక మార్పు తీసుకు వచ్చిందని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.