హైదరాబాద్ హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తె తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో అఖిలపక్షం సమావేశమైంది. తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ హాజరయ్యారు. గంటపాటు సాగిన సమావేశంలో సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఉపాధి లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం భవంతుల నిర్మాణం చేపట్టడం మానేసి... ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బతుకు దెరువు కల్పించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను పెట్టారు.
1. కరోనా నిర్మూలన, కొవిడ్ చికిత్సకు సౌకర్యాలు పెంచాలి, జిల్లాల్లో వసతులు విస్తరింపచేయాలి.
2. అసంఘటిత కార్మికులు, చేతివృత్తుల, చిరువ్యాపారులు, గల్ఫ్ కార్మికులకు నవంబర్ వరకు నెలకు 7 వేల 5 వందలు, సరిపడా ఉచిత రేషన్ ఇవ్వాలి
3. తొలగించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకుని సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి.
4. ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాల లెక్క చెప్పాలి.
5. కరోనాను సాకుగా చూపిస్తూ ప్రజాందోళనలపై ప్రభుత్వ నిర్భందాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో అఖిలపక్షం అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. కొవిడ్ నియమ, నిబంధనలకు అనుగుణంగా వర్చువల్ రచ్చబండ, వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.