ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చూట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేకుండా వచ్చే ఆరునెలల్లో అన్ని కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా మార్చే పనిలో ఉంది సర్కారు. ఇప్పటికే సెక్రటేరియట్ సహా మరికొన్ని ఆఫీసుల్లో ఈ విధానం అమలవుతోంది. ఈ విధానంలో ప్రతి ఉద్యోగికి సెక్యూర్డ్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటాయి. వారు ఎక్కడి నుంచైనా లాగిన్ కావచ్చు. దీనితోపాటు స్వీయ ధ్రువీకరణ నిమిత్తం ‘డిజిటల్ టోకెన్’ అందిస్తారు. దాని ద్వారా అధికారి ఎక్కడి నుంచయినా ఫైళ్లను పర్యవేక్షించటం సాధ్యమవుతుంది. కచ్చితంగా కార్యాలయం నుంచే విధులు నిర్వర్తించాల్సిన పనిలేదు. ఫైలు ఏ దశలో ఉంది? ఏ అధికారి వద్ద ఎంత కాలం ఉంది? అనే విషయాలను సులువుగా తెలుసుకోగలుగుతారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఐటీ శాఖ సమన్వయంతో అన్ని కార్యాలయాల్లో అమలు
రాబోయే మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రమంతా ఈ-ఆఫీసు విధానం అమలుచేయాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్లను గుర్తించాలని కోరాం. ఐటీశాఖలోని ఉద్యోగబృందాలు వారికి సహకరించి సంబంధిత శాఖలో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సేవలను వినియోగించుకున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ వంటి అధికారులు జిల్లాస్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. ఈ విధానంలో ఫైళ్లు, రికార్డుల నిర్వహణ సులువు. వేగంగా ఫైళ్లను పరిష్కరించవచ్చు. ఏ నిమిషంలో ఏ రికార్డు అవసరమైనా తక్షణం పొందే సౌలభ్యం ఉంటుంది. ఫైల్‌గానీ, తపాలా గానీ గల్లంతయిందని చెప్పటానికి అవకాశం ఉండదు. ఉద్యోగులు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా దీనికి అలవాటుపడొచ్చు. శిక్షణ రెండు దశల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు సందేహాలు తీర్చుకోవడానికి వీలుగా డెమో సర్వర్, యూజర్ మాన్యువల్ అందుబాటులో ఉంటాయి. టెస్ట్‌లాగిన్ కూడా సిద్ధంగా ఉంటుంది.
ఫైళ్ల పరిష్కారం వేగవంతం
ఈ-ఆఫీసు వల్ల పనుల్లో వేగం, పారదర్శకత పెరిగాయి. మండలస్థాయి నుంచి జిల్లా వరకూ మొత్తం 102 ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతోందని నిర్మల్ జిల్లాకలెక్టర్ ముషారఫ్‌అలీ పేర్కొన్నారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి 7 రోజుల సమయం తీసుకుంటే, ఇప్పుడు 2 రోజుల్లోనే పరిష్కరించగలుగుతున్నాం. కలెక్టర్ అనుమతి కోసం వచ్చే ఫైళ్లు కూడా కేవలం గంటల వ్యవధిలోనే పరిష్కారమవుతున్నాయి. దీనితోపాటు స్టేషనరీ, ఇతర ఖర్చులు బాగా తగ్గాయి. ఒక్క కలెక్టరేట్‌లోనే నెలకు దాదాపు రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదా అవుతోంది. నూరుశాతం ఈ-ఆఫీసు అమలవుతున్న జిల్లాగా నిర్మల్ గుర్తింపు తెచ్చుకోవటం సంతృప్తికరంగా ఉంది.
కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పింది
పోలీసు సిబ్బంది పూర్తిస్థాయి సమయాన్ని విధులకు కేటాయించాలన్న మా లక్ష్యం ఈ-ఆఫీస్ ద్వారా నెరవేరిందని కామారెడ్డి ఎస్పీ శ్వేత అభిప్రాయపడ్డారు. గతంలో కానిస్టేబుళ్లు సెలవు(ఈఎల్) తీసుకోవాలంటే పై అధికారులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి దరఖాస్తుపై సంతకం చేయించుకోవలసి వచ్చేది. ఇప్పుడది పోయింది. ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్‌ఐఆర్ నమోదు లాంటి వాటి కోసం కొన్నిచోట్ల లంచాలు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడందుకు ఆస్కారం తగ్గింది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేశాం. పోలీసు విధుల్లో ఉన్నవారు కార్యాలయంలోనే ఫిర్యాదు అందజేయవచ్చు. ఈ-ఆఫీసు విధానం ద్వారా 22 నెలల కాలంలో 5,983 ఫైళ్లు పరిష్కరించగలిగాం. 2665 పనిదినాలను (మాన్‌డేస్) పొదుపు చేయగలిగాం. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం ద్వారా పర్యవేక్షణ, త్వరితగతిన ఫలితాల సాధన సాధ్యమైంది.
ఇదీ చూడండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!