బిహార్లో సాధించిన విజయం మజ్లిస్ బలోపేతానికి సంకేతం అని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 70 ఏళ్లలో కేవలం తెలంగాణలోనే పరిమితం కాకుండా మహారాష్ట్ర, బిహార్, ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్న విషయాన్ని మజ్లిస్ ఓ చిన్న పార్టీ అని నోరుపారేసుకున్నవారు మర్చిపోవద్దని పేర్కొన్నారు. బిహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందడం పార్టీకి శుభసూచకమని సంతోషం వ్యక్తం చేశారు. బండ్లగూడ ఎంఎం కాలనీలో వరద బాధితులకు శుక్రవారం సాయంత్రం ఆర్థిక సాయాన్ని అందజేశారు.
పాతబస్తీలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ముంపునకు గురై ఆటోలు, టాక్సీలు పాడైన వాహన యజమానులకు, వరద బాధితులకు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి రూ.22లక్షల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు.
సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో రూ.6.50 కోట్లతో 31 వేల నిత్యవసర సరకుల కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ.11కోట్ల సాయాన్ని పేదలకు అందించామని... మజ్లిస్ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేవలం 8 రోజుల్లో పాతబస్తీలో వరద ముంపునకు గురైన ప్రాంతాలలో పేరుకుపోయిన 10 వేల టన్నుల చెత్తను తొలగించేందుకు కృషి చేశామన్నారు.
ఇదీ చదవండి: సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రజలను ఆదుకుంటాం: అక్బరుద్దీన్