హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే 25 నుంచి క్రమంగా దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అనుమతించిన దేశాలతో‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం కింద అంతర్జాతీయ విమాన సర్వీసులూ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దేశంలోని ఇతర విమానాశ్రయాలతో పోల్చితే.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వృద్ధి ఎక్కువగా ఉంది. మొదటి కొన్ని వారాల్లో ప్రతిరోజూ సుమారు 3000 మంది మాత్రమే ప్రయాణించే వారు. నేడు ప్రయాణికుల సంఖ్య రోజూ 20 వేలను దాటిపోయింది. మొదటితో పోలిస్తే.. ఇది 6 రెట్లు అధికం.
230 విమానాలు..
విమానాశ్రయం తిరిగి ప్రారంభమైన రోజు నుంచి సెప్టెంబర్ 30 నాటికి 1.2 మిలియన్ల మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మే 25న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ సుమారు 40 దేశీయ విమానాలు రాకపోకలు సాగించాయి. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 230కి చేరింది. విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి సెప్టెంబర్ 30 నాటికి 13,500కు పైగా దేశీయ విమానాలు రాకపోకలు సాగించాయి.
ఇప్పుడు రెండు మార్గాల్లో..
కొవిడ్‌కు పూర్వం హైదరాబాద్ నుంచి 55 గమ్యస్థానాలు ఉండేవి. దాదాపు 95 శాతం దేశీయ కనెక్టివిటీ పునరుద్ధరించబడినట్లు హైదరాబాద్ విమానాశ్రయం ప్రకటించింది. ఇప్పుడు 52 దేశీయ గమ్యస్థానాలకు విమానాల రాకపోకలు సాగుతున్నాయి. కొవిడ్ తదనంతర కాలంలో ఎక్కువ సర్వీసులు ఉన్న మొదటి 5 గమ్యస్థానాలుగా దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రారంభంలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వన్ వే ట్రాఫిక్ ఉండగా, ఇప్పుడు డిమాండ్ క్రమంగా రెండు మార్గాల్లో ఉంది.
దేశీయ సర్వీసులతో పాటు మార్చి 20 నుంచి అంతర్జాతీయ విమానాలను కూడా నిర్వహిస్తోంది ఆర్‌జీఐఏ. వందే భారత్ మిషన్, వివిధ దేశాల్లో ప్రారంభించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాల ప్రకారం వీటిని అనుమతించారు. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ కింద హైదరాబాద్ నుంచి యూకే, యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా, ఖతార్లకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి కాక వివిధ దేశాల నుంచి అనేక చార్టర్లు క్రమం తప్పకుండా హైదరాబాద్‌కు వచ్చిపోతున్నాయి.
మరింత పెరగనుంది..
అంతర్జాతీయ విమాన సర్వీసుల పరంగా ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్‌జీఐఏ నుంచి 800కు పైగా విమానాల రాకపోకలు సాగాయి. వివిధ దేశాల నుంచి దాదాపు 1.1 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు వందే భారత్, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పంద విమానాలు, చార్టర్లలో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇతర దేశాలతోనూ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాలు కుదిరితే అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య మరింత పెరుగుతుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడుతోంది. లగేజీ డిస్ ఇన్ఫెక్షన్, నగదు రహిత లావాదేవీలు, రిటైల్ అవుట్లెట్ల వద్ద భౌతిక దూరం ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. విమానాశ్రయంలో ఇప్పటికే దేశీయ విమానాల కోసం ఈ-బోర్డింగ్ ఉంది. లగేజీ ట్యాగ్‌లను ప్రింట్ చేసే కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ చెకిన్ కియోస్కులు ఏర్పాటు చేశారు. టచ్‌లెస్ టెర్మినల్ ఎంట్రీ, సెల్ఫ్-బ్యాగేజ్ డ్రాప్స్, కాంటాక్ట్-లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కాంటాక్ట్-లెస్ వాటర్ ఫౌంటెన్, కాంటాక్ట్-లెస్ ఎలివేటర్లు లాంటి ఆవిష్కరణలను విమానాశ్రయంలో ఉపయోగిస్తున్నారు.
ఇదీ చూడండి.. ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం