ఎయిమ్స్... ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ. దేశంలోని అత్యుత్తమ వైద్యనిపుణులు, అంకితభావం గల సిబ్బంది, విదేశాలకు తీసిపోని మౌలిక వసతులకు నెలవు. సామాన్యుడు మొదలుకొని రాష్ట్రపతి వరకు ఎవరు అనారోగ్యం పాలైనా మొట్టమొదటి ఎంపిక ఎయిమ్స్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఎయిమ్స్ తెలంగాణకు మంజూరు కావడంతో రాష్ట్ర ప్రజలు ఎంతగానో సంతోషించారు. ఇందుకోసం హైదరాబాద్‌కు అతి సమీపంలోని బీబీనగర్‌ను ఎంపిక చేయడంతో తమకు ఉత్తమ వైద్యసేవలు అందుతాయని అంతా ఆశించారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. 2018లో మంజూరై 2019లో ప్రారంభమైనా ఇప్పటి వరకు పూర్తిస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోలేదు.
తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం శీతకన్నేసింది. భారీగా నిధులు కేటాయించినా ఇప్పటి వరకు అరకొరే విడుదల చేసింది. దీంతో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కాలేదు. దేశంలో 2014 తర్వాత మంజూరైన ఎయిమ్స్‌లలో తెలంగాణకే అతి తక్కువగా నిధులు వచ్చాయని సహ చట్టం(ఆర్‌టీఐ) ద్వారా వెల్లడైంది. 2014 తర్వాత మంజూరైన ఎయిమ్స్‌లలో ప్రారంభమైనవి ఎన్ని, వాటికి కేటాయించిన నిధులు, విడుదలైనవి, వాటిలో అవుట్‌పేషెంటు, ఇన్‌పేషెంటు సేవలు, వైద్యకళాశాలల ప్రారంభానికి గడువు తదితర అంశాలపై సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను సమాచారం కోరగా వ్యయ వివరాలను అందించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 ప్రకారం ఏపీతో పాటు తెలంగాణకు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దాదాపు నాలుగేళ్ల తర్వాత 2018 ఏప్రిల్ 8న కేంద్ర మంత్రిమండలి తెలంగాణ ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదించింది. రూ.1028 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపి 200 ఎకరాల్లో దీనిని స్థాపిస్తామని ప్రకటించింది.
నిమ్స్ భవనాల్లో...
అప్పటికే బీబీనగర్‌లో తెలంగాణ ప్రభుత్వం 60 ఎకరాల్లో నిమ్స్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం ఎయిమ్స్‌ను మంజూరు చేయడంతో భూమితో సహా భవనాలను అప్పగించింది. అప్పటికే నిర్మించిన ఆ భవనాల్లో 2019 ఆగస్టులో వైద్యకళాశాల ప్రారంభమైంది. డిసెంబరులో వైద్యసేవలను మొదలుపెట్టింది. ఎయిమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.1028 కోట్ల నిధులను కేటాయించడంతో నిర్మాణాలను చేపట్టారు. కానీ కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.23.85 కోట్లను మాత్రమే విడుదల చేసింది. దీంతో గుత్తేదారు పనులను నిలిపివేయడంతో నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్దేశిత గడువైన వచ్చే సెప్టెంబరు నాటికి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కావాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మరో నాలుగేళ్లు పట్టేలా కనిపిస్తోంది. ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యంపై ఎంపీలు పార్లమెంటులో పదేపదే ప్రస్తావిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎయిమ్స్‌కు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నా నిర్మాణాలపై సందిగ్ధత కొనసాగుతోంది. భవనాలు పూర్తికాకపోవడంతో ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ సేవలు అందడం లేదు. నిపుణులు, సిబ్బంది కొరత ఉంది. మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేవు. సౌకర్యాల కొరత కారణంగా 200 ఎంబీబీఎస్ సీట్లకు 50 సీట్లతోనే ఇక్కడ వైద్యకళాశాల ప్రారంభమైంది. 750 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కాగితాల్లోనే ఉంది.
నిధుల మంజూరులో అట్టడుగున..
రాష్ట్రాల వారీగా 2014 తర్వాత మంజూరైన ఎయిమ్స్‌లలో తెలంగాణ ఎయిమ్స్ పరిస్థితే దీనంగా ఉంది. పశ్చిమబెంగాల్‌కు రూ.966.99 కోట్లు, నాగ్‌పుర్(మహారాష్ట్ర)కు రూ.945.63 కోట్లు, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌కు రూ.879.74 కోట్లు, బిలాస్‌పుర్ (హెచ్‌పీ) రూ.858.14 కోట్లు, గోరఖ్పుర్(యూపీ)కి రూ.755.12 కోట్లు, భటిండా (పంజాబ్)కు రూ.668.40 కోట్లు, అస్సాంకు రూ.435 కోట్లు, ఝార్ఖండ్‌కు రూ.379 కోట్లు, జమ్మూకు రూ.371 కోట్లు, కశ్మీర్‌కు రూ.253 కోట్లు, రాజ్‌కోట్(గుజరాత్)కు రూ.166 కోట్లు విడుదల చేయగా తెలంగాణకు రూ.23.85 కోట్ల నిధులనే విడుదల చేశారు.
ఇదీ చూడండి: బీబీనగర్ ఎయిమ్స్ కోసం వెచ్చించింది రూ.22.78కోట్లు మాత్రమే